యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలనాధికారి కార్యాలయంలో మంత్రి జగదీశ్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 278 కొనుగోలు కేంద్రాల్లో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశామని మంత్రి పేర్కొన్నారు. 692 మంది రైతులకు 7 కోట్ల 62 లక్షల చెల్లింపులు సైతం చేశామని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆందోళన వద్దు... తడిసిన ధాన్యం కొంటాం
అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని నిబంధనల మేరకు కొనుగోలు చేస్తామని.. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి జగదీశ్ రెడ్డి భరోసానిచ్చారు. గన్ని బ్యాగ్లు అవసరం మేరకు జిల్లాలో సిద్ధం చేసినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లు పాయింట్లకు తరలించాలని అధికారులకు సూచించారు.
అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం త్వరలోనే అందుతుందన్నారు. లాక్ డౌన్ నిబంధనలు ప్రజలు కచ్చితంగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు.