యాదాద్రిలో ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్న సీఎం కేసీఆర్ యాదాద్రికి వెళ్లి స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆదివారం ఆయన యాదాద్రిని సందర్శించనున్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఒక నివేదక రూపంలో సిద్ధం చేస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో కేసీఆర్ యాదాద్రి వెళ్లారు. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు వెళ్తున్నారు.
నిర్మాణ పనులపై సమీక్ష:
ఆదివారం ఉదయం 11 గంటలకు యాదాద్రి చేరుకోనున్న సీఎం కేసీఆర్ మొదట స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత ఆలయ అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. ప్రధానాలయం, ప్రెసిడెన్షియల్ సూట్ల నిర్మాణం, రింగ్ రోడ్డు పనులను.. కేసీఆర్ పరిశీలించే అవకాశం ఉంది. ఆలయ పునర్‌నిర్మాణ పనుల పురోగతిపై హరిత హోటల్‌లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సీఎం కేసీఆర్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. యాదాద్రి కొండపైన హరిత హోటల్‌ను అధీనంలోకి తీసుకున్న పోలీసులు.. అక్కడ అడుగడుగునా తనిఖీలు నిర్వహిసంచారు. రహదారి మార్గం పరిశీలించి... హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు.
సుమారు 2 వేల కోట్లతో నిర్మాణం:
యాదాద్రి ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పునర్‌నిర్మిస్తోంది. సుమారు రూ.2 వేల కోట్లతో నిర్మాణం చేపట్టింది. యాదాద్రి పుణ్య క్షేత్రానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు తరలివచ్చేలా అద్భుతంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదతీరేలా అక్కడ పచ్చదనం ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని దివ్య విమాన రాజగోపురానికి స్వర్ణకాంతులు అద్దనున్నారు. ఇందుకోసం 60కిలోల బంగారాన్ని ఉపయోగించనున్నారు. ఇందుకు రూ.40 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఆలయ పునర్ నిర్మాణంలో భక్తులు పాలుపంచుకోవాలని, డబ్బు లేదా వస్తు రూపంలో విరాళాలు ఇవ్వాలని ఆలయ ఈవో గీతా ఒక ప్రకటనలో కోరారు.
ఇదీ చూడండి: కొత్త రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలి : కేసీఆర్