యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ శాఖా గ్రంథాలయానికి పుస్తకాల సేకరణ చేపట్టడం మంచి కార్యక్రమమని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలోని భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో మోత్కూర్ శాఖా గ్రంథాలయం కోసం 50 పుస్తకాలను గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ కోమటి మత్స్యగిరికి ఆయన అందజేశారు. గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని.. విజ్ఞానాన్ని నలుగురికి పంచి పెట్టే పనిలో భాగంగా ఈ పుస్తకాల సేకరణ చేపట్టడం అభినందనీయమన్నారు.
మోత్కూర్ ప్రాంతం చైతన్యానికి ప్రతీక అని కొనియాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి, సినీ గేయ రచయిత అభినయ శ్రీనివాస్, వికీపీడియాలో ప్రపంచ రికార్డ్ సృష్టించిన ప్రణయ్ రాజ్ మోత్కూర్ ప్రాంత వాస్తవ్యులు కావడం గర్వించదగ్గ విషయమన్నారు. నేడు బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్ వచ్చిందని, అది చాలా ప్రమాదకరమన్నారు. ప్రతీ ఒక్కరూ గ్రంథాలయాలకు వెళ్లి విజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. కరోనా పరిస్థితులు చక్కబడ్డ తర్వాత మోత్కూర్ గ్రంథాలయాన్ని తప్పక సందర్శిస్తానని, గ్రంథాలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని మామిడి హరికృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాభారతి సాహితీ సంస్థ ప్రధాన కార్యదర్శి గుమిడిల్లి వెంకన్న పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఇందూరులో నిరాడంబరంగా ఇంజినీర్స్ డే