వరంగల్ జిల్లాల పేర్లు, స్వరూపాన్ని మార్చినందుకు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, ఆరూరి రమేశ్, శంకర్ నాయక్, రాజయ్య, చల్లా ధర్మారెడ్డిలు ప్రగతిభవన్‌లో సీఎంను కలిశారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల మనోభావాలు, అభిప్రాయాల మేరకు వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండగా, వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ జిల్లాగా సవరించినందుకు నేతలు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు వరంగల్ జిల్లాల పేర్లను మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని ఓరుగల్లు వాసులు స్వాగతించారు. హన్మకొండ పేరుతో జిల్లా ఏర్పాటు చేయడం సంతోషదాయకమని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యే నరేందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
హన్మకొండ జిల్లా ఏర్పాటు నోటిఫికేషన్ జారీతో నగర ప్రజలు సంబురాలు జరుపుకున్నారు. బాణాసంచా కాలుస్తూ ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, దయాకర్‌రావు, ఎమ్మెల్యే నరేందర్ చిత్ర పటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
కేసీఆర్‌కు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు..
ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు న్యాయం జరిగేలా నూతన జోనల్ విధానాన్ని రూపొందించడంతో పాటు రాష్ట్రపతి ఆమోదం కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. టీఎన్జీవో, టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రగతిభవన్‌లో సీఎంను కలిశారు. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా వెంటనే 50 వేల ఉద్యోగాల భర్తీ చేపడుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
సోమవారమే నోటిఫికేషన్..
వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణ జిల్లాలు హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల వరంగల్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు జిల్లాల పేర్లు, స్వరూపం మార్పును ప్రతిపాదించారు. హన్మకొండ, పరకాల రెవెన్యూ డివిజన్లతో ఉండే హన్మకొండ జిల్లాలో 12 మండలాలు ఉంటాయి. వరంగల్, నర్సంపేట రెవెన్యూ డివిజన్లతో వరంగల్ జిల్లాలో 15 మండలాలు ఉంటాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాలు, వినతులకు నెలరోజులు గడువు ఇచ్చింది. నెల రోజుల్లోపు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ కలెక్టర్లకు అభ్యంతరాలు, వినతులు ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి: WARANGAL: జిల్లాల పేరు మార్పు.. నోటిఫికేషన్ వచ్చేసింది!