రాష్ట్రంలో ప్రాంతీయ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం సాకారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా తొలిదశలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌తో పాటు కొత్తగూడెంలో విమానాశ్రయ ఏర్పాటుకు అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పరిస్థితులను అధ్యయనం చేయాల్సిందిగా భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ)ను కోరింది.
అన్నీ సానుకూల అంశాలే
వరంగల్‌లోని మామ్నూరు వద్ద ప్రాంతీయ విమానాశ్రయ నిర్మాణానికి అన్ని పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్లు ఏఏఐ నిఏదికలో స్పష్టం చేసింది. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో దూసుకుపోతున్న వరంగల్ ప్రాంతంలో ప్రయాణికుల సంఖ్య బాగానే ఉంటుందన్న అభిప్రాయంతో ఉన్నారు. నిర్వహణ వ్యయాన్ని రాబట్టుకునేందుకు అనువుగా ఈ విమానాశ్రయం ఉంటుందని నిపుణులు నిర్ధారిస్తున్నారు. వరంగల్‌లో 706 ఎకరాల్లో ఉన్న ఎయిర్‌ఫీల్డు నుంచి గతంలో విమానాలు రాకపోకలు సాగించాయి. ప్రస్తుతం అది వినియోగంలో లేదు. ఇక్కడ విమానాల రాకపోకలకు వీలుగా రెండు రన్‌వేలు వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ భూసేకరణ సమస్య కూడా లేకపోవడం మరో కలిసి వచ్చే అంశం. ప్రస్తుతానికి ఏటీఆర్-72, క్యూ-400 విమానాలకు అనుకూలంగా ఉంటుందని నివేదిక స్పష్టం చేస్తోంది. భవిష్యత్తులో మరో 150 ఎకరాల భూమిని కేటాయిస్తే ఎ-320, బోయింగ్-737 విమానాలు దిగేందుకు వీలుగా కూడా విస్తరించేందుకు అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. వరంగల్‌తోపాటు తొలిదశలో కొత్తగూడెం విమానాశ్రయానికి అవకాశాలున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐటీసీ, సింగరేణి సంస్థలతోపాటు విజయవాడ, రాజమహేంద్రవరానికి సమీపంలో ఉండటం సానుకూలంగా ఉంది.
నెలాఖరులోగా సవివర నివేదిక
ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటుపై నెలాఖరులోపు ఏఏఐ అధికారులు ప్రభుత్వానికి సవివర నివేదికను అందించనున్నారు.
ఇదీ చూడండి: HYDERABAD DMRL: విమానాల రెక్కలు మరింత తేలికగా, ధృడంగా...!