రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అందుబాటులోకి రానున్న వరంగల్ మెట్రో రైలు(neo metro rail) ఆకాశ, భూ మార్గంలో పయనించనుంది. అందుకోసం మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ (Maharashtra Metro Rail Corporation Ltd) సంస్థ సరికొత్త సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (DPR)ను రూపొందించింది. గతంలో 15 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని పూర్తిగా హైదరాబాద్ తరహాలో ఆకాశమార్గంలో నిర్మించాలని ప్రతిపాదించగా తాజాగా మార్పులతో కొత్త డీపీఆర్(DPR)ను మహామెట్రో సంస్థ సిద్ధం చేసింది.
నాసిక్, నాగ్‌పూర్ తరహాలో
కొత్త విధానంలో నిర్మాణ వ్యయంతోపాటు నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుందని మహామెట్రో సంస్థ పేర్కొంది. దాదాపు రూ.2,000 కోట్ల మేర ఆదా అవుతుందని సంస్థ వివరించింది. ఏడు కి.మీ. భూ, మరో 8 కి.మీ. ఆకాశమార్గంలో మెట్రో రైలు నడుస్తుంది. మహా మెట్రో సంస్థ రూపొందించిన నియో వరంగల్ కొత్త డీపీఆర్‌ను కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(kuda warangal) రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిందని.. త్వరలో దీన్ని కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నారని మహామెట్రో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బ్రిజేష్ దీక్షిత్ తెలిపారు. నాసిక్, నాగ్‌పుర్ తదితర నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. వరంగల్ మెట్రోకు నాసిక్ నియో మెట్రో రైలు ప్రాజెక్ట్ తరహాలోనే డీపీఆర్‌ను రూపొందించింది.
రూ.1,000 కోట్ల వ్యయం
నియో మెట్రో (neo metro rail)వరంగల్ ప్రాజెక్టుకు రూ.1,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. సాధారణ విధానంలో అయితే కిలోమీటరు నిర్మాణానికి రూ.180 కోట్ల వ్యయం అవుతుండగా.. తాజా డీపీఆర్ ప్రకారం కి.మీ.కు రూ.60 కోట్లు ఖర్చవుతుందని వివరించారు. ప్రస్తుతం వరంగల్ మహానగర జనాభా పది లక్షలు కాగా 20 ఏళ్లకు అంటే 2041కి జనాభా 20 లక్షలవుతుందని అంచనా. 20- 30 లక్షల జనాభా ఉండే మధ్య తరహా నగరాలకు నాసిక్‌కు ప్రతిపాదించిన నియో మెట్రో విధానం చక్కగా సరిపోతుందని వరంగల్‌కు దీన్నే ప్రతిపాదించారు.
ఎలక్ట్రిక్ బస్సులు.. రబ్బర్ టైర్లు..
నియో మెట్రో సాంకేతికతలో ఎలక్ట్రిక్ బస్సులను ఉపయోగిస్తారు. రబ్బర్ టైర్లపై నడవడం దీని ప్రత్యేకత. వరంగల్ రోడ్లు కొత్త మెట్రోకు సరిపోతాయని ఈ తరహా మెట్రోను ప్రతిపాదించినట్లు సంస్థ వివరించింది. ఈ మార్గంలో మూడోవంతు ప్లాట్‌ఫాంలు మాత్రమే షెడ్లుగా ఉండనున్నాయి. ఫలితంగా నిర్మాణ, విద్యుత్తు వ్యయం భారీగా ఆదా అవుతుంది. ఆటోమెటిక్ టికెటింగ్ విధానంతో నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుంది. సాధారణ విధానంలో అయితే మెట్రో నిర్వహణ కోసం కి.మీ.కు 35 మంది అవసరం కాగా కొత్త విధానంలో నియో మెట్రోకు 15 మంది మాత్రమే సరిపోతారు.
ఇదీ చూడండి: వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి ఏడో విడత హరితహారం