పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించే ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్న ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇన్‌స్పైర్ (నిఫ్) వేడుకల్లో ప్రదర్శించే అంశాల్లో నాణ్యత, నవ్యతపై దృష్టి సారించింది. ఈమేరకు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఈ విషయంపై ఆదేశాలు, సూచనలు విడుదల చేసింది.
మేధస్సుకు పదునుపెట్టేలా ఉండాలి
నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ తెలిపిన వివరాల ప్రకారం సాధారణంగా 18 రకాల ప్రదర్శనల విషయమై పలు అనుకరణలు వస్తున్నాయని గుర్తించారు. వీటిని ప్రాథమిక దశలోనే నిలువరించాలని జిల్లా సైన్స్ అధికారులను కోరింది. విద్యార్థుల మేధస్సుకు పదనుపెట్టి నాణ్యమైన ప్రదర్శనలను ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు నిఫ్ సూచించింది. ఈమేరకు ఇంతకుముందు ప్రదర్శనల్లో ప్రశంసలు పొందిన వాటిని కొద్దిపాటిమార్పు చేసి వాటినే ప్రదర్శించడం సరికాదని నిఫ్ పేర్కొంది. మెరుగైన, వినూత్న ఆలోచనలకు స్వాగతం పలికే ప్రదర్శనలను మాత్రమే ఆహ్వానించాలని వరంగల్ జిల్లా సైన్సు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
అర్హులు వీరే
అన్ని యాజమాన్య పాఠశాలల్లో అభ్యసిస్తున్న ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులు అర్హులని తెలిపారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల నుంచి ఉత్తమ ఆలోచనలను పంపించాలి. ఎంపికైన విద్యార్థులకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని వ్యక్తిగత అకౌంట్‌లో జమ చేస్తారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ ప్రాజెక్టుల ప్రదర్శన పోటీలు జరుగుతాయి. వినూత్న ఆలోచనలతో విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి
విద్యార్థులు ఆలోచనల దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపించాలి. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్‌స్పైర్‌అవార్డ్స్.డీఎస్‌టీ.గౌ.ఇన్ వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి. పాఠశాల యూ-డైస్ సంఖ్య, ఈ-మెయిల్, విద్యార్థుల సంఖ్య, ప్రధానోపాధ్యాయుడు, ఇన్‌స్పైర్ ఇన్‌ఛార్జి ఉపాధ్యాయుడి పేరు, సెల్ నంబర్లు, పాఠశాల చిరునామా తదితర విషయాలు నమోదు చేయాలి.
ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాం
వరంగల్ జిల్లా పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులకు నిఫ్ సూచించిన విషయాలను ఆన్‌లైన్‌లో అవగాహన కల్పించాం. పాత వాటికి స్వస్తిపలికిి, వినూత్న ఆలోచనలతో రూపొందించినవాటిని మాత్రమే ప్రదర్శనలకు పంపించాలి. విద్యార్థుల మేధస్సును పెంచేలా గైడ్ టీచర్లు తోడ్పాటు అందించాలి.
- పి.సురేష్‌బాబు, జిల్లా సైన్స్ అధికారి
ఇదీ చూడండి: కూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది!