పదేళ్లుగా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేదు. ఏది అడిగినా ఒకరిపై ఒకరు నెట్టేసుకునే వారు. రెవెన్యూ, భూమి, కొలతల శాఖ, ఇరిగేషన్, గ్రేటర్ వరంగల్ అధికారులు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించే వారు. దీంతో త్రినగరిలో ప్రధాన నాలాలు ఆక్రమణకు గురైనా ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నగరం నీట మునిగింది. వరదల పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించేందుకు మంత్రి కేటీఆర్ వచ్చారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని నయీంనగర్, పెద్దమ్మగడ్డ, బొందివాగు, శివనగర్ నాలాలు పరిశీలించారు. నాలాలపై వెలిసిన ఆక్రమణలపై కొరడా ఝుళిపించాలని అధికారులను ఆదేశించారు. అర్బన్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. వారం రోజుల క్రితం కమిటీ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. నయీంనగర్, భద్రకాళి, బొందివాగు, కరీమాబాద్ సాకరాశికుంట నాలాలకు వంద అడుగులు విస్తరించాలని తీర్మానించారు. ఇప్పటికే నయీంనగర్, భద్రకాళి నాలాల మార్కింగ్ చేపట్టారు. ఇన్‌ఛార్జి సిటీప్లానర్ నర్సింహరాములు పర్యవేక్షణలో టౌన్‌ప్లానింగ్ విభాగం ఇదే పనిలో ఉన్నారు.
ఆధునిక మిషన్లతో మార్కింగ్
నాలాల మార్కింగ్‌కు నీటి పారుదల శాఖ వినియోగించే లేజర్ మిషన్లు గ్రేటర్ కార్పొరేషన్ నాలుగు కొనుగోలు చేసింది. నాలాల్లో పారుతున్న వరదనీటి ప్రవాహన్ని అంచనా వేసి, సెంటర్ పాయింట్ ఆధారంగా ఇరువైపులా యాభై అడుగుల చొప్పున మార్కింగ్ ఇస్తున్నారు. నయీంనగర్, భద్రకాళి నాలాలకు ఇదే విధానాన్ని అమలు చేశారు. ఇరిగేషన్ ఏఈ, రెవెన్యూ శాఖ డిప్యూటీ తహసీల్దార్, ఏసీపీలు, టీపీవోలు, టీపీఎస్‌లు, చైన్‌మెన్లు, పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడ్డారు. ఇప్పటికే రెండు నాలాల మార్కింగ్ పూర్తి చేశారు.
* వరంగల్ పోతననగర్, హంటర్‌రోడ్ బొందివాగు, కరీమాబాద్ సాకరాశికుంట నాలాల మార్కింగ్ కోసం టోటల్ స్టేషన్ మిషన్(టీఎస్‌ఎం) అద్దెకు తీసుకొని గురువారం నుంచి రంగంలోకి దించారు.
ఇప్పటివరకు ఇలా...
* నయీంనగర్, భద్రకాళి నాలాలపై గురువారం సాయంత్రం వరకు 27 ఆక్రమణలు తొలగించారు. ఎక్కువ శాతం భద్రకాళి నాలావే ఉన్నాయి. ములుగురోడ్ సెంటర్లో పెట్రోల్ పంపు, ఎలక్ట్రికల్ దుకాణం, మారుతి సుజుకీ షోరూం, ఫర్నిచర్ షాపు, టింబర్ డిపోలు, తాత్కాలిక షెడ్లు కూల్చేశారు.
* శిథిలావస్థలో ఉన్న పాత భవనాల తొలగింపు ముమ్మరంగా సాగుతోంది. గురువారం సాయంత్రం నాటికి 270 పాత ఇళ్లను కూల్చేశారు. టీపీబీవోలు, చైన్‌మెన్లతో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. తినగరితోపాటు, 42 విలీన గ్రామాల్లో సైతం పాత భవనాలు నేలమట్టం చేస్తున్నారు.
ఇలా తొలగిస్తున్నారు...
* నాలాల మార్కింగ్ కోసం 24 మందితో నాలుగు బృందాలు ఏర్పాటు. ఒక్కో బృందంలో ఇద్దరు టీపీఎస్‌లు, డీటీ, ఇరిగేషన్ ఏఈ, ఇద్దరు పోలీసులున్నారు.
* నాలుగు అద్దె జేసీబీలు.
* ఒక హిటాచీ యంత్రం
* నాలుగు స్లాబ్ కట్టర్ మిషన్లు
* నాలుగు లేజర్ మిషన్లు
* అద్దె ప్రాతిపదికన ఒక టోటల్ స్టేషన్ మిషన్
* రెండు అద్దె జీపులు
* సిటీ ప్లానర్, ముగ్గురు అసిస్టెంట్ సిటీప్లానర్లు పర్యవేక్షణ
ఇదీ చదవండి: 'రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా ఈటీవీ రజతోత్సవం'