కొందరికి పాటలు పాడటం అలవాటు, మరికొందరికీ వినడం, ఇంకొందరికి రాయడం... ఇలా ఒక్కక్కరికీ ఒక్కో అలవాటు ఉండటం సహజమే. వరంగల్ కాజీపేటకు చెందిన ఈశ్వర్‌కు మాత్రం ఈల వేయందే పొద్దుపోదు. రోజులో సగభాగం ఈలేస్తూనే గడిపేస్తాడు. మంచి మంచి పాటలను మృధుమధురంగా ఈల వేస్తూ పాడటం.. ఈశ్వర్ నేర్చుకున్న విద్య.
ఈలేస్తూ... పాటలు:
చిన్నతనంలో ఈశ్వర్‌కి పాటలు పాడటమంటే మహా ఇష్టం. అందరిలా తానూ పాడితే ప్రత్యేకత ఏముందని.. ఆలోచించాడు. వైవిధ్యంగా ఉంటుందని ఈల ద్వారా పాటలు పాడాలని నిర్ణయించుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా ఆచరణలో పెట్టాడు. ఐటీఐ చదివిన ఈశ్వర్.. కాజీపేటలో సొంతంగా కంప్యూటర్స్ దుకాణం నడుపుతున్నాడు. ఖాళీ సమయాల్లో అక్కడా సాధన చేస్తున్నాడు. పాట పల్లవి, చరణం ఏ మాత్రం తప్పకుండా, తప్పుల్లేకుండా.. పెదాలు కలుపుతూ ఈల వేస్తూ పాటలు పాడేయడం మొదలు పెట్టాడు.
మెలోడీ పాటలే ఎక్కువ:
పాత కొత్త పాటలన్న తేడా లేకుండా.. ఏ పాటైనా ఈల వేస్తూ పాడుతాడు ఈశ్వర్. మెలోడీ పాటలు ఇష్టపడే ఈశ్వర్ వాటినే ఎక్కువగా పాడుతాడు. స్నేహితుల పెళ్లిళ్లకు, వేడుకలకు వెళ్తే ఈలేందే వెనక్కిరాడు.
సినీరంగంలోకి వెళ్లడమే లక్ష్యం
నాలుగైదు పాటలైనా విరామం లేకుండా ఈలతో పాడేయడం ఈశ్వర్‌కు అలవాటే. సినిమా అంటే ప్రాణమని... భవిష్యత్తులో సినీరంగంలోకి వెళ్లాలన్నదే కోరిక అని ఈశ్వర్ చెబుతున్నాడు.తన కోరిక నెరవేరాలని మనమూ సంతోషంగా ఈల వేసి చెబుదామా!
ఇదీ చూడండి: ప్రగతిభవన్‌లో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం