Mumbai Ferry Tragedy : ముంబయి సముద్ర తీరంలో జరిగిన లాంటి భయానక పడవ ప్రమాదాన్ని తమ జీవితంలో చూడలేదని ఘటనాస్థలికి సహాయక చర్యల కోసం తొలుత చేరుకున్న బోటు డ్రైవర్లు తెలిపారు. తాము ఘటనాస్థలికి చేరుకున్నప్పటికి అక్కడ పరిస్థితి ఘోరంగా, అస్తవ్యస్తంగా ఉందని ముంబయి పోర్ట్ ట్రస్ట్ పైలట్ బోట్ డ్రైవర్ ఆరిఫ్ బమనే చెప్పారు. కొందరు బాధితులు సాయం కోసం అరుస్తున్నారని, మరికొందరు ఏడుస్తున్నారని వెల్లడించారు.
'20-25 మందిని రక్షించాం'
"మహిళలు, పిల్లలను రక్షించేందుకు మేం ప్రాధాన్యం ఇచ్చాం. మేం ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నప్పటికే ఒక ఫిషింగ్ ట్రాలర్, మరో పర్యటక పడవ అప్పటికే ఘటనాస్థలికి చేరుకున్నాయి. నా బృందంతో కలిసి బుధవారం సాయంత్రం జవహర్ దీప్ నుంచి ముంబయి వెళ్తుండగా ఫెర్రీ ప్రమాదం గురించి కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందింది. వీలైనంత త్వరగా ఘటనాస్థలికి వెళ్లాలని సూచించారు. నీట మునిగిన వారిని రక్షించేందుకు శాయశక్తులా కృషి చేశాం. 20-25 మంది రక్షించాం. తర్వాత వారిని నౌకాదళానికి చెందిన పడవలకు బదిలీ చేశాం" అని బమనే తెలిపారు.
'భయంకరమైన, విషాదకరమైన ప్రమాదం'
తన 18 ఏళ్ల బోట్ డ్రైవింగ్ అనుభవంలో చిన్న చిన్న రెస్క్యూ ఆపరేషన్లను చూశానని బమనే తెలిపారు. కానీ ఫెర్రీ పడవ ప్రమాదం మాత్రం అత్యంత భయంకరమైనదని పేర్కొన్నారు. అలాగే విషాదకరమైన ప్రమాదమని వెల్లడించారు. ఇది ఇప్పటివరకు తాను చూసిన అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్ అని పేర్కొన్నారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల ఓ చిన్నారి కదలకుండా ఉండిపోయిందని, ఆమె ఛాతీపై కొట్టడం వల్ల ఊపిరి తీసుకుందని చెప్పారు.
'నా జీవితంలో ఇలాంటి ప్రమాదాన్ని చూడలేదు'
ఎలిఫెంటా ద్వీపం నుంచి బుధవారం మధ్యాహ్నం 3.35 గంటలకు తన పడవ బయలుదేరిందని, అప్పుడే ఫెర్రీ పడవ ప్రమాదం గురించి తెలిసిందని చిన్న పర్యటక పడవ డ్రైవర్ ఇక్బాల్ గోతేకర్ పేర్కొన్నారు. ఆ తర్వాత 25-30 నిమిషాల తర్వాత ఘటనాస్థలికి చేరుకున్నానని తెలిపారు. బోల్తా పడిన పడవలో ఉన్న వ్యక్తులు సాయం కోసం చేతులు ఊపుతున్నారని చెప్పారు. తన పడవలో 16 మందిని రక్షించి, వారిని సురక్షితంగా గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద దింపానని వెల్లడించారు. తన కెరీర్ లో ఇలాంటి సంఘటనను ఎప్పుడూ చూడలేదని చెప్పారు.
ఎక్స్గ్రేషియా ప్రకటించిన మోదీ
ముంబయి తీరంలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50వేలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. "ముంబయిలో పడవ ప్రమాదం జరగడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు అధికారులు అండగా ఉంటారు" అని పీఎంఓ కార్యాలయం ఎక్స్ పోస్టులో పేర్కొంది.
అసలేం జరిగిందంటే?
గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు నీల్కమల్ అనే ఫెర్రీ దాదాపు 100 మందికి పైగా పర్యటకులతో బుధవారం బయలుదేరింది. ఈ క్రమంలో చక్కర్లు కొడుతూ వేగంగా వచ్చిన నేవీకి చెందిన ఓ స్పీడ్ బోటు దాన్ని బలంగా ఢీకొట్టింది. దాంతో ఫెర్రీ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మరో 99 మందిని రక్షించారు అధికారులు. అయితే ఫెర్రీ బోటు ప్రమాదంపై విచారణ జరుపుతామని మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సావంత్ తెలిపారు. తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.