ఉమ్మడి వరంగల్ జిల్లాపై ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాజీపేట, హన్మకొండల్లో వర్షం కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. వరంగల్ గ్రామీణ జిల్లాతో పాటు ములుగులోని ఏటూరినాగారం, వాజేడు, వెంకటాపురం మండలాల్లో గత రాత్రి నుంచి నిర్విరామంగా వానలు పడుతున్నాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. వాజేడు మండలంలోని బొగత జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పాలనురగల్లాంటి జలధారలు కనువిందు చేస్తున్నాయి.
పంటలకు ఊరట
జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల మొక్కజొన్న, పత్తి పంటలకు ఊరట కలిగినట్లయింది. భారీ వర్షాలపై అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌తో పాటు మహబూబాబాద్, జనగామలలో కూడా వానలు జోరుగా కురిశాయి. వర్షాల్లేక విలవిల్లాడిన నేలమ్మ ఈ వానలతో పులకించిపోయింది.
ఇదీ చూడండి : భద్రాద్రి రామయ్య ఆస్తులను కాపాడండి