భవిష్యత్తులో బహుజన బిడ్డలే పాలకులవుతారని...... బీఎస్పీ తెలంగాణ సమన్వయ కర్త ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పునరుద్ఘాటించారు. హనుమకొండలో బీఎస్పీ వరంగల్ ఉమ్మడి జిల్లాల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తమ రక్తంలో మాట తప్పే, మడమ తిప్పే లక్షణం లేదన్న ప్రవీణ్ కుమార్..... తాము అంబేడ్కర్, కాన్షీరాం వారసులమని తెలిపారు. బీఎస్పీని గెలిపించాలని బహుజన దేవతలకు మొక్కాలన్న ఆయన... రాజ్యాంగం రాసిందే తమ తాత అంబేడ్కర్ అని వ్యాఖ్యానించారు. బహుజన యువత బానిసలవుతారో.. పాలకులవుతారో.. తేల్చుకోవాలని సూచించారు.
బానిసత్వాన్ని పక్కనపెట్టి...బహుజనులే పాలకులు కావాలని.. బీఎస్పీ సమన్వయకర్త ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆకాంక్షించారు. అధికారంలోకి వచ్చాక నేతలు దోపీడీ చేసిన వేల కోట్ల రూపాయలను తిరిగి రాబట్టి.... విద్య, వైద్యం, ఉపాధిపై ఖర్చు పెడతామని చెప్పారు. బహుజన వాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని.. పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇంటింటికీ వాడవాడకు తిరిగి... పార్టీ గుర్తును, సిద్ధాంతాలను ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన పలువురికి కండువా కప్పి ఆహ్వానించారు.
ఏనుగు గుర్తుపైనే తెలంగాణ భవన్‌కు వెళ్లాలని...రెండేళ్లలోనే ఇది నిజం చేయాలని అన్నారు. రెండు పడకల గదులిస్తామని తెరాస మోసం చేసిందని ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. పది లక్షల బందు కాదని... కోట్ల రూపాయలివ్వాలన్నారు. గత పాలకుల హయంలో వంచన గురై...అవమానాలు పడ్డామని ఇక మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలన్నారు. మిగతవారిలా కల్లబొల్లి మాటలు కాకుండా... చెప్పిందే చేస్తామని, చేసేదే చెప్పామని అన్నారు. గులాబీ తెలంగాణ పోయి...నీలి తెలంగాణ రావాలని అన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
మా రక్తంలో మాట తప్పే, మడమ తిప్పే లక్షణం లేదు, మేం అంబేడ్కర్, కాన్షీరాం వారసులం. ఏనుగు గుర్తును గెలిపించాలని బహుజన దేవతలకు మొక్కాలి. రాజ్యాంగం రాసిందే మా తాత అంబేడ్కర్. భవిష్యత్‌లో బీసీ, ఎస్టీ, ఎస్టీ బిడ్డలే పాలకులు. బానిసలవుతారా.. పాలకులవుతారా.. తేల్చుకోవాలి -ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ రాష్ట్ర సమన్వయ కర్త.
ఇదీ చూడండి: RS Praveen kumar: 'మీ బంధు- బంధూకుల డ్రామాలకు చరమగీతం పాడతాం'