BRS MLA Candidates Cry Defeat in Telangana Assembly Election 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవం చెందింది. కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తూ 64 స్థానాల్లో గెలుపొందింది. ఈ క్రమంలో బీఆర్ఎస్కు చెందిన ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కొందరు కన్నీటిపర్యంతమయ్యారు.
కేసీఆర్(KCR) లేని తెలంగాణను ఊహించుకోలేక పోతున్నానంటూ కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ కన్నీరు పెట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలో జరిగన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. ఇక ముందు ప్రజల మధ్య ఉంటూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణను కొట్లాడి తెచ్చిన కేసీఆర్ లేడే అంటూ ఇతర రాష్ట్రాల వారు అంటున్నారని ఆవేదన చెందారు. ఈ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం 39 స్థానాల్లో మాత్రమే విజయకేతనం ఎగురవేసింది. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవి శంకర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం 37,439 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యంకు 90,395 ఓట్లు రాగా, సుంకె రవిశంకర్(బీఆర్ఎస్)కు 52,956 ఓట్లు వచ్చి రెండోస్థానంలో నిలిచారు. మూడోస్థానంలో బొడిగ శోభ(బీజేపీ) 26,669 ఓట్లు వచ్చాయి.
Former Bhuvanagiri MLA Pailla Shekar Reddy Cry : భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కూడా భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశం ముగించుకొని వెళుతున్న సమయంలో ఎదురు వచ్చిన మహిళా నాయకులు, కార్యకర్తలు ఏడవడంతో ఆయన కూడా భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. కార్యకర్తలను ఓదార్చి ధైర్యం చెప్పారు. అంతకు ముందు సమావేశంలో మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కుంభంపాటి అనిల్‌కుమార్ రెడ్డి భువనగిరిలో మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని సూచించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కంభంపాటి అనిల్‌కుమార్(కాంగ్రెస్) ఫైళ్ల శేఖర్‌రెడ్డి(బీఆర్ఎస్)పై 26,202 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కంభంపాటి అనిల్‌కుమార్ 1,02,744 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థికి 76,542 ఓట్లు వచ్చాయి.
Ex MLA Shankar Naik of Mahabubnagar Cried : నియోజకవర్గాన్ని ఇంతగా అభివృద్ధి చేసినా.. ఈ విధంగా తీర్పును ఇవ్వడం దురదృష్టకరమని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీలో కోవర్టులు ఎక్కువగా ఉండడం వల్లే ఓటమి చెందామని చెప్పారు. ఇలాంటి విషయాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గెలిచిన పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పక్షంలో మానుకోట రాళ్లకు మళ్లీ పని చెప్పవలసిన అవసరం వస్తుందని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారం సమయంలో తనపై చేసిన భూకబ్జాల ఆరోపణలు చేసిన వారికి సవాల్ విసిరారు. నిన్నటి ఫలితాల్లో భూక్య మురళీనాయక్(కాంగ్రెస్) 50,171 ఓట్ల మెజారిటీతో శంకర్ నాయక్(బీఆర్ఎస్)పై ఘన విజయం సాధించారు. భూక్య నాయక్‌కు 1,16,644 ఓట్లు రాగా, శంకర్ నాయక్‌కు 66,473 ఓట్లు లభించాయి.
ఎన్నో ఏళ్ల తర్వాత దక్కిన విజయం - ఆ నియోజకవర్గాల్లో గెలుపు కాంగ్రెస్‌కు చాలా స్పెషల్
కేసీఆర్ హ్యాట్రిక్ విన్‌కు బ్రేక్ - తెలంగాణలో కారు పంక్చర్ కావడానికి కారణాలేంటి?