రాజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా యాత్ర చేపడితే ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రజాకార్ల అరాచకాలు, ఆకృత్యాలకు గురైన స్థలాల సందర్శనకు బండి సంజయ్ చేపట్టిన యాత్ర వరంగల్ నగరానికి చేరుకుంది.
అధికారికంగా జరపాలి
హన్మకొండలోని నక్కలగుట్ట వద్ద అమరవీరుల స్థూపానికి బండి సంజయ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోతే 2023లో భాజపా అధికారంలోకి వస్తుందని అన్నారు. సమైక్య పాలన నుంచి ఇప్పటి వరకు తెలంగాణ విమోచన దినోత్సవం కోసం భాజపా డిమాండ్ చేస్తుందన్నారు. కానీ ఏ ప్రభుత్వం కూడా జరపడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎంకు సీఎం కేసీఆర్ భయపడుతున్నాడని అన్నారు. ఎన్నికల ముందు ఒక విధానం.. ఎన్నికల తర్వాత మరో విధానం ఉందన్నారు.
రోశయ్యను ప్రశ్నించిన సీఎం
తెలంగాణ ద్రోహులు కేసీఆర్కు దగ్గర అయ్యారని... తెలంగాణ కోసం కొట్లాడిన వారు కనుమారుగయ్యారని అన్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తే సీఎం కేసీఆర్ కేసులు పెడతానని భయపెట్టిస్తున్నాడని పేర్కొన్నారు. పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటకలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతున్నారని వివరించారు. గతంలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవం గురించి ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆ రోషం ఏమైందని ప్రశ్నించారు.
ఇదీ చూడండి : 'డివిజన్ల పునర్విభజన, ఓట్లు చేర్పించడంపై జాగ్రత్తగా ఉండాలి'