వరంగల్ నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నగరవాసులకు ఇంటింటికీ తాగునీరందించే బృహత్ పథకాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

సర్వాంగ సుందరంగా..
గ్రేటర్ ఎన్నికలు ముంగిట నిలిచిన వేళ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్లో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో మంత్రి సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. దాదాపు రూ.1500 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పార్కులు, జంక్షన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. భద్రకాళి బండ్, పద్మాక్షిగుట్ట వద్ద సరిగమపదనిస పార్కు, బాలసముద్రంలోని పార్కులను ముస్తాబు చేశారు.

అభివృద్ధి పనులకు శ్రీకారం
వరంగల్ నగరవాసులకు ఇకపై మంచినీటి సమస్య తీరనుంది. దాదాపు రూ.వెయ్యికోట్లతో మిషన్ భగీరథ ద్వారా నీరందించే పథకాన్ని ఉగాది కానుకంగా మంత్రి ప్రారంభించనున్నారు. లబ్ధిదారులకు రెండుపడక గదుల ఇళ్లు, రెండెకరాల స్ధలంలో రూపుదిద్దుకుంటున్న సమీకృత మార్కెట్లు మొదలైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

సత్యవతి సందర్శన
వరంగల్లో వందలాది కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. నగరంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించే ప్రదేశాలను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిట్లో కేటీఆర్ భోజనం, బస చేసే గదులను పరిశీలించారు. రేపు మంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని వెల్లడించారు.
మంత్రి పర్యవేక్షణ
ఈ పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: బూచోడంటూ పిల్లల్ని భయపెడుతున్నారా..? అయితే ఇది చదవాల్సిందే!