రియల్టర్ల బారిన పడిన తన భూమి తనకు ఇప్పించాలంటూ వరంగల్ అర్బన్ జిల్లా ఆరెపల్లి గ్రామానికి చెందిన దండు విజయలక్ష్మి సంబంధిత రెవెన్యూ అధికారులను వేడుకుంది. ఒగ్లాపూర్ శివారులోని జాతీయరహదారి ప్రక్కన సర్వే నంబరు 75లో గల మూడెకరాల 28 గుంటల భూమిని 1753,1754 నంబర్ల ద్వారా కొనుగోలు చేశామని తెలిపారు. కొంత కాలం కిందట తన భూమిలో నుంచి 23 గుంటలను పబ్బ ఆనంద కుమారి (బృందావన్ టౌన్షిప్) ఆక్రమించుకుని... ప్లాట్లు చేసి అమ్మకాలు కొనసాగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే సంబంధిత రెవెన్యూ అధికారులకు విషయం తెలియజేయగా... వారు వచ్చి సర్వే చేయించి బృందావన్ టౌన్షిప్ ఆక్రమించుకున్న భూమి తన భూమిగా నివేదిక అందజేశారని విజయలక్ష్మి తెలిపారు. అయినప్పటికీ పబ్బ ఆనందకుమారి భయభ్రాంతులకు గురిచేస్తూ, ప్లాట్లను అమ్ముతున్నారని వాపోయారు. వెంటనే రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు రెండు రోజులు పట్టే అవకాశం!