వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నర్సంపేట, గీసుగొండ పోలీస్స్టేషన్లలో వేరువేరు దొంగతనాల కేసులో ఐదుగురు నిందితులను నర్సంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి వివరాలను వెల్లడించారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకేపల్లి గ్రామానికి చెందిన జింక నాగరాజు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తూ జైలుకి కూడా వెళ్లి వచ్చినట్లు ఆమె తెలిపారు. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకుని కొత్త కొత్త ప్రదేశాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వివరించారు.
బుధవారం రాత్రి నర్సంపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా.. నాగరాజు పోలీసులకు తారస పడ్డాడని, పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి సుమారు 33.7 తులాల బంగారం, 115 గ్రాముల వెండి, ఒక స్కూటీని రికవరీ చేసినట్లు తెలిపారు. దొంగతనం చేసిన బంగారాన్ని మిత్రులైన నాగుల ప్రవీణ్, కట్ట రాజు, ఉల్లందుల ప్రశాంత్, వల్లంపట్ల పరమేశ్‌తో కలిసి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపారు. నాగరాజుపై నర్సంపేటలో 7 కేసులు, గీసుకొండ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉన్నాయన్నారు.
నాగరాజుతో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని, పట్టుకున్న బంగారం విలువ రూ.17.5 లక్షలు, వెండి రూ.69 వేల వరకు ఉంటుందని డీసీపీ వెంకటలక్ష్మి వివరించారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన సీఐ పులి రమేశ్‌గౌడ్, ఎస్సైలు బొజ్జ రవీందర్, అంగోత్ సురేశ్‌లతో పాటు సిబ్బందిని డీసీపీ వెంకటలక్ష్మి, ఏసీపీ సంపత్‌రావులు అభినందించారు.
ఇవీ చదవండి: