మేడారం జాతరకు దేశ నలుమూలల నుంచి లక్షల్లో భక్తులు తరలివస్తుంటారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్రప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులను మేడారానికి తరలించేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసింది.
వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో నుంచి మహాజాతరకు భక్తులను తరలించడం కోసం డిపోలో ఉన్న 60 బస్సులతో పాటు సంగారెడ్డి, దేవరకొండ, సిద్దిపేట, హయత్ నగర్, దిల్సుఖ్నగర్ డిపోల నుంచి 175 అద్దె బస్సులను నడపనున్నారు.
ఈనెల 5 నుంచి 8 వరకు జరిగే ఈ మహాజాతరకు నర్సంపేట డిపో నుంచి మొత్తం 235 బస్సులను నడపనున్నారు. ఈ బస్సుల ద్వారా కోటి ఇరవై లక్షల రూపాయల ఆదాయం సమకూర్చే లక్ష్య సాధనతో పనిచేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
నర్సంపేట నుంచి మేడారానికి, పెద్ద వాళ్లకు 190 రూపాయలు, పిల్లలకు 110రూపాయలను టికెట్ ధరలను నిర్ణయించామని అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, మంచినీటి వసతులు, ప్రత్యేక టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
- ఇదీ చదవండి: దిల్లీ జామియా వర్సిటీలో మళ్లీ కాల్పుల కలకలం