వినియోగదారులను కూరగాయల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. వంద రూపాయలకు నాలుగు రకాల కూరగాయలైనా రావట్లేదని వాపోతున్నారు. అయినా తప్పనిసరి పరిస్ధితుల్లో ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తుంటారు. ఇది కొనుగోలుదార్ల పరిస్థితైతే.. వాటిని పండించే రైతుల పరిస్థితి మరోలా ఉంది. ముఖ్యంగా టమాట ధరలు పడిపోతున్నాయి. సొరకాయ ధర నేలచూపులు చూస్తోంది. దీంతో గిట్టుబాటు ధర రాని పరిస్ధితుల్లో రైతులు వాటిని చేలల్లోనే వదిలిస్తున్నారు.
ఎంత కాసినా ఏం లాభం..
వరంగల్ గ్రామీణ జిల్లాలో 4,391 ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తుండగా.. అందులో 1,304 ఎకరాల్లో టమాట, 163 ఎకరాల్లో రైతులు సొర సాగు చేస్తున్నారు. ఈ సారి మంచి దిగుబడి వచ్చింది. టమాట, సొరకాయలు విరగకాయడంతో ప్రారంభంలో మంచి ధరే వచ్చింది. కానీ క్రమంగా ధరలు పడిపోసాగాయి. ప్రస్తుతం ఒక్కో సొరకాయకు ఒకటి, రెండు రూపాయలు రావడం కష్టమవుతోంది. టమాట కేజీ రెండు నుంచి నాలుగు రూపాయల లోపే ఉంటోంది. పంట పెట్టుబడికి తోడు కూలీ ఖర్చులు తడిసిమోపడువుతున్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం రైతులకు దక్కకపోగా.. పెట్రోల్, డీజిల్ ధరలతో రవాణా ఖర్చులూ పెరుగుతున్నాయి. దీంతో రైతులు గత్యంతరం లేని పరిస్ధితుల్లో చేలల్లోనే కాయలొదిలేస్తున్నారు. మరికొందరు తప్పనిసరి పరిస్ధితుల్లో ఆ ధరకే అమ్మి నష్టాలు మూటగట్టుకుంటున్నారు.
దళారుల దందా..
ఇక బయట మార్కెట్లలో మాత్రం ఒక్కో సొరకాయ రూ. 20, కేజీ టమాట రూ. 10 నుంచి 20కి దళారులు అమ్ముకుంటున్నారు. దీంతో అమ్మబోతే అడవి కొనబోతే కొరివి చందంగా కాయగూరల పరిస్ధితి తయారైంది. పంట పండించే రైతులు, కొనే ప్రజలు నష్టపోగా.. మధ్యనున్న దళారులు మాత్రం లబ్ధి పొందుతున్నారు.
ఇదీ చదవండి: గానుగ నూనెతో ఆరోగ్యం... భారీగా పెరుగుతున్న వాడకం