పల్లెప్రగతి కార్యక్రమం సీఎం కేసీఆర్(CM KCR) కలల ప్రాజెక్టు అని పంచాయతీ రాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. దీనిపై సీఎం రోజూ సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. పల్లెప్రగతి(PALLE PRAGATHI) కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం రామచంద్రాపురం గ్రామంలో కలెక్టర్ హరితతో కలసి దళిత వాడల్లో పర్యటించారు. సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే మార్గాలను అధికారులకు సూచించారు. గ్రామంలో నిర్మించిన ప్రకృతివనం, శ్మశానవాటికల నిర్మాణాలను పరిశీలించి... స్థానిక సర్పంచ్ జయశ్రీ దిలీప్ రావుని అభినందించారు.
రోజూ సీఎం సమీక్ష
నూతన పంచాయతీ రాజ్ చట్టం ద్వారా నేరుగా గ్రామ పంచాయతీలకే నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. పల్లె ప్రగతిపై సీఎం రోజూ సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారని అన్నారు. అనంతరం గ్రామ ప్రజలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.
పల్లె ప్రగతిలో ఏం చేస్తారు?
నాలుగో విడత పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా గత నెలలో నిర్వహించారు. పది రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరిగాయి. ఇందుకోసం గ్రామాలు, పట్టణాల వారీగా పల్లెప్రగతి, పట్టణప్రగతి నివేదికలు తయారు చేసి... ఆయా గ్రామాలు, పట్టణాలకు వచ్చిన నిధులు, చేసిన ఖర్చు, చేపట్టిన పనులు, ప్రస్తుతం వాటి స్థితి, అవసరాలు, తదితరాలను చర్చించారు. పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, హరితహారం, విద్యుత్ అంశాలు ప్రధాన ఎజెండాగా పదిరోజుల ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
పరిశుభ్రతకు ప్రాధాన్యం
ఈ కార్యక్రమంలో భాగంగా రహదార్లు, ప్రజా ఉపయోగ స్థలాలను శుభ్రంగా ఉంచడంతో పాటు రోడ్లపై గుంతలు పూడ్చివేయాలి. పాడుబడిన భవనాలు, శిథిలాలను తొలగిస్తారు. ఖాళీ స్థలాలకు సంబంధించి కూడా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. వాటిని కూడా శుభ్రం చేసి అందుకు అయిన ఖర్చు, జరిమానా, పాలనా వ్యయాన్ని యజమానుల నుంచి వసూలు చేయాలని స్పష్టం చేసింది. పాతబావులను పూడ్చివేయాలి. మురుగుకాల్వలు శుభ్రం చేయాలి. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో మురుగునీటిని తొలగించాలి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ఫాగింగ్, రసాయనాల పిచికారీ, ఆయిల్ బాల్స్ వేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాలి, మంచినీటి వనరులను శుభ్రం చేసి క్లోరినేషన్ చేయాలి. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల పనులన్నింటినీ పూర్తి చేసి వాటన్నింటినీ పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలి.
ఇదీ చదవండి: వాళ్లతో మాట్లాడిందని మహిళను చితకబాదిన కుటుంబసభ్యులు