రాష్ట్రాల నుంచి పన్నులు వసూలు చేసి.. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఆరేళ్లలో లక్షా 72 వేల కోట్ల పన్నులు చెల్లిస్తే.. లక్షా 52 వేల కోట్లే కేంద్రం తిరిగి ఇచ్చిందన్నారు. దమ్ముంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి చర్చకు రావాలని మంత్రి సవాల్ విసిరారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారసభలో ఆయన పాల్గొన్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు భాజపా పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. ఒక్క రాష్ట్రంలో చూపించినా ముక్కునేలకు రాస్తానని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వచ్చే బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వందశాతం సబ్సీడీపై రుణాలను అందించబోతున్నామని మంత్రి తెలిపారు. చట్టసభల్లో ప్రశ్నించే గొంతు మాత్రమే కాదు.. పరిష్కారం చూపే గొంతు ఉండాలని రాంచందర్ రావును ఎద్దేవా చేశారు.
తెరాస అభ్యర్థి పల్లారాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులకు ఎర్రబెల్లి సూచించారు. ఈ సమావేశంలో మంత్రి సత్యవతి రాఠోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు శ్రీనివాసరెడ్డి, బస్వరాజు సారయ్య, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, తెరాస నాయకులు, పట్టభద్రులు పాల్గొన్నారు.