కష్టనష్టాలకోర్చి కుటుంబం యావత్తు ఆరుగాలం కష్టించి కొద్దో గొప్పో పండించిన పంటకు సకాలంలో డబ్బులురాక అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో పలు గ్రామలకు చెందిన రైతుల నుంచి ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొన్నారు. తమ కష్టానికి మద్దతు ధర వస్తుందనే కొండంత ఆశతో అన్నదాతలు కొనుగోలు ఈ కేంద్రాలకే అమ్మారు.
కాని పంటకోసం పడిన కష్టం కంటే ఇప్పుడు డబ్బులు కోసం పడుతున్న కష్టాలు ఎక్కువయ్యాయి. ధాన్యం అమ్మి నెల గడుస్తున్నా సొమ్ములు రాక సొమ్మసిల్లిపోతున్నారు. అప్పులు చేసి మరీ పంట పండిస్తే బిల్లు చెల్లింపుల్లో ఆలస్యమైతే వచ్చే మొత్తం వడ్డీకే సరిపోతుందనని డీలాపడిపోతున్నారు. దళారులకు అమ్మకుంటే దగా పడిపోతామనే భయంతో కోనుగోలు కేంద్రాల్లో అమ్మితే మొత్తానికే ముంచేశారని వాపోతున్నారు.
అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకోవాడనికి తీవ్రకష్టాలు పడ్డామని, డబ్బుల కోసం రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాపులు కాస్తున్నామని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కష్టానికి ప్రతిఫలం అందిచాలని వేడుకుంటున్నారు.