ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం రైతు శ్రీనివాస్ అయిదెకరాల్లో మిర్చి సాగు చేశాడు. ఎకరానికి రూ. లక్ష పెట్టుబడి పెట్టారు. సీజన్ మొదట్లో మిర్చి మంచి ధర పలకడంతో కోత కోశాక పెట్టుబడి పోను అధిక లాభం వస్తుందని ఎదురుచూశాడు. పంట కోత కొచ్చే సరికి లాక్‌డౌన్‌తో మార్కెట్లు మూతపడ్డాయి. చేసేదేంలేక మిర్చి కోయించి కోల్డ్ స్టోరేజ్‌లో సరకు భద్రపరుచుకున్నాడు. మళ్లీ పంట ఎప్పుడు విక్రయించాలో తెలియని పరిస్థితి. కూలీలకు డబ్బులు చెల్లిద్దామంటే చిల్లి గవ్వ లేదు. కరోనా వల్ల బయట అప్పు పుట్టడం లేదు. ప్రస్తుతం శ్రీనివాస్‌ది దిక్కుతోచని పరిస్థితి.
మిర్చికి మార్కెట్లో మంచి ధర పలుకుతున్న తరుణంలో లాక్‌డౌన్‌తో వ్యవసాయ మార్కెట్లు మూతపడ్డాయి. ఏప్రిల్, మే నెలల్లో మార్కెట్‌కు మిర్చి పోటెత్తుతుంటుంది. ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాల వ్యాప్తంగా సాగవుతున్న 93,981 ఎకరాల్లో 18,79,620 క్వింటాళ్ల మిర్చి దిగుబడులు వస్తాయని ఉద్యాన శాఖ అంచనా. ఈసారి మిర్చికి పట్టిన తెగుళ్లతో దిగుబడి తగ్గడమే గాక, లాక్‌డౌన్‌తో.. కోసిన పంట అమ్మలేని పరిస్థితి ఎదురైంది. అకాల వర్షాల వల్ల కూడా పంట తడిసిపోతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.
29 గిడ్డంగులు...
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 29 శీతల గిడ్డంగులున్నాయి. వరంగల్‌లో 25, మహబూబాబాద్‌లో నాలుగు ఉన్నాయి. వీటిలో 60 వేల నుంచి లక్ష బస్తాల నిల్వ సామర్థ్యం కలిగినవి ఉన్నాయి. భారీగా దిగుబడులు ఉన్న రైతులకు గిడ్డంగుల్లో భద్రపరిచి తర్వాత విక్రయించడం కొంత వరకు గిట్టుబాటు అయినా, ఒకటి రెండెకరాల్లో సాగు చేసే చిన్న రైతులకు ప్రస్తుతం గడ్డు కాలమే ఉంది. గిడ్డంగుల్లో దాచుకోలేక, ఇంటి వద్ద నిల్వ చేసుకోలేక అవస్థలు పడుతున్నారు. వరంగల్‌లోని శీతల గిడ్డంగిలో ఆరు నెలలకు బస్తాకు రూ.150, మహబూబాబాద్‌లో ఆరు నెలల కాలానికి బస్తాకు రూ.180 చొప్పున తీసుకుంటున్నారు. మొదట గిడ్డంగుల్లో దాచుకునేందుకు సొమ్ము చెల్లించాక తర్వాత ధర రాకపోతే తమ పరిస్థితి ఏమిటని రైతులు వాపోతున్నారు.
మధ్యవర్తులకు విక్రయం
మార్కెట్లు మూత పడడం వల్ల శీతల గిడ్డంగుల్లో పెట్టుకోవడానికి ఇష్టపడని రైతులు మధ్య దళారులకు తమ పంటను విక్రయిస్తున్నారు. మార్కెట్లో సీజన్ ఆరంభంలో క్వింటాకు రూ.20 వేలకు పైగా రికార్డు ధరలు పలికిన మిర్చి మొన్నటిదాక క్వింటాకు రూ.13 వేల ధర పలికింది.
ఆదుకుంటున్న పథకం
శీతల గిడ్డంగుల్లో సరకు దాచుకున్న వారికి ప్రభుత్వ రైతు బంధు పథకం కింద వడ్డీ లేని రుణం రూ.2లక్షల వరకు ఇస్తోంది. ఈ పథకం ఉండటం వల్లే చాలా మంది మిర్చి రైతులు కరోనా లాక్‌డౌన్ కష్టాల నుంచి గట్టెక్కుతున్నారు. రూ.3లక్షలు ఆపై పెట్టుబడి పెట్టిన రైతులు మాత్రం ఈ రుణం తమకు సరిపోదంటున్నారు. పెట్టుబడి కోసం చేసిన అప్పుతో పాటు, కూలీలకు చెల్లించాల్సి ఉందంటున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఎవరూ రుణం కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు.
కూలీలకు ఇవ్వలేకపోతున్నాం
ఐదు ఎకరాల్లో మిర్చి పంట వేశాను. మార్కెట్ మూతపడటంతో పంట చేతికి వచ్చినా ఫలితం లేకుండా పోయింది. కూలీల సొమ్ము ఇవ్వలేకపోతున్నా. శీతలగిడ్డంగిల్లో పంటను దాచుకుంటున్నా. ధాన్యం మాదిరిగా ప్రభుత్వమే మిర్చిని కొనుగొలు చేయాలి.
- బిక్కనూరు సుదర్శన్ చిట్యాల, జయశంకర్ భూపాలపల్లి
ఖర్చు అధికమవుతోంది
" నేను 5 ఎకరాల మిర్చి సాగు చేశా. దిగుబడి బాగా వచ్చింది. కానీ మిర్చి పంటను కొనేవారు లేరు. లాభాల మాట పక్కన పెడితే పెట్టుబడి సొమ్ము వస్తే చాలన్నట్లు ఉంది మా పరిస్థితి."
- రావుల సుధాకర్, ముద్దునూరు, దుగ్గొండి మండలం.