వనపర్తి జిల్లా పరిధిలోని రేషన్ డీలర్లు.. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. రేషన్ దుకాణాల్లో వినియోగదారుల నుంచి వేలిముద్ర గుర్తింపు తీసుకోవడానికి ప్రభుత్వం సరఫరా చేసిన యంత్రాలకు సిగ్నల్ అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
సిగ్నల్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. పలుమార్లు పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా… ఎలాంటి ఫలితం లేదని వాపోయారు. ప్రస్తుతం కరోనా వైరస్ వేగవంతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వేలిముద్ర గుర్తింపులు వెంటనే కాకపోవడంతో రేషన్ షాపుల ముందు వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు.
ఉదయం 6 గంటల నుంచి రేషన్ షాపులు తెరిచి ఉంచినప్పటికీ.. కొంతమంది వినియోగదారులకు మాత్రమే సరకులు అందుతున్నాయని పేర్కొన్నారు. రేషన్ డీలర్లకు థర్డ్ పార్టీ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన పట్టించుకోవడం లేదని వారు పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వాలకు వారధులుగా పనిచేసే రేషన్డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేదంటే.. ఈనెల 31న రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: రాగల రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు