కరోనా మహమ్మారి కట్టడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వ్యక్తులపై వనపర్తి జిల్లా పోలీసులు కొరడా ఝుళిపించారు. బుధవారం ఒక్క రోజే ఏకంగా... 275 మందికి రూ.1000 చొప్పున జరిమానాలు విధించారు. ఎస్పీ అపూర్వరావు ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్లలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు... మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిని గుర్తించి జరిమానాలు విధించారు.
కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోన్న తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్లపై తిరిగే వారికి అవగాహన కల్పిస్తూనే జరిమానాలు విధించినట్లు ఏఎస్పీ షాకీర్ హుస్సేన్ పేర్కొన్నారు. నిబంధనలు పాటించని 275 మందికి రూ.వెయ్యి చొప్పున రూ.2.75 లక్షలు ఒకే రోజు జరిమానాల రూపంలో వసూలు చేసినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన రోజుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని పోలీసులు హెచ్చరించారు.