విస్తారంగా కురిసిన వర్షాలతో రాష్ట్రం నిండా ధాన్యపురాశులేనని... కొనుగోళ్ల విషయంలో జాగత్త్రగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు అన్ని శాఖల అధికారులతో వేరువేరుగా సమీక్ష నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ నుంచి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి త్వరలో ముఖ్యమంత్రికి నివేదిక అందించనున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్ల కోసం 306 జిన్నింగ్ మిల్లులు, 34 మార్కెట్ యార్డులు, 340 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపట్టనున్నట్లు మంత్రులు పేర్కొన్నారు. పత్తి పంట సాగు విస్తీర్ణానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. యాసంగి సాగుకు విత్తనాలు, ఎరువులపై సంపూర్ణ ప్రణాళికలు, ఎరువుల బఫర్ స్టాక్ పెంచేందుకు సంబంధించిన అంశాలపై అధికారులను ఆదేశించారు.
వేరువేరుగా మంత్రుల సమీక్షలు..
తన నివాసంలో వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యాన, వేర్ హౌసింగ్, మార్క్ ఫెడ్, విత్తనాభివృద్ధి, సహకార, పౌరసరఫరాల శాఖల అధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ శాఖ ప్రధాన కార్యదర్శి పార్థసారధి, కమిషనర్ రాహుల్ బొజ్జ, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్, సహకార శాఖ కమిషనర్ వీర బ్రహ్మయ్య, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వర రావు, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, మార్క్ ఫెడ్ ఎండీ భాస్కరాచారి హాజరయ్యారు.