జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో కరోనా విస్తరించకుండా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు పీజేపీ అతిథి గృహంలో ఎంపీ రాములు సహా వనపర్తి, గద్వాల జిల్లాల శాసనసభ్యులు, కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కరోనా, ధాన్యం కొనుగోళ్లు, పంట నష్టం తదితర అంశాలపై మంత్రి చర్చించారు.
గ్రామాల్లోనూ సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించాలని, పారిశుద్ధ్య పనులను కొనసాగించాలని మంత్రి కోరారు. కారణం లేకుండా ఇళ్లలోంచి బయటకు వచ్చే వారిపై పోలీసులు కఠినంగా ఉండాలన్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ప్రజాప్రతినిధులు ఎవరూ వెళ్లొద్దని సూచించారు.
గద్వాల జిల్లాలో వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఇతర జిల్లాల నుంచి ధాన్యం రాకుండా చూడాలన్నారు. పంటనష్టం వివరాలు పక్కాగా సేకరించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి: ఆ 2 విషయాల వల్లే అమెరికాలో కరోనా చిచ్చు!