పారిశుద్ధ్య నిబంధనలు పాటించకుండా రోడ్లపై చెత్త వేసేవారికి జరిమానా విధించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి, పెబ్బేరు మండలం కంచిరావుపల్లిలో ఆయన పర్యటించారు. హరితహారం కోసం ఏర్పాటు చేసిన నర్సరీలు, పారిశుద్ధ్య కార్యక్రమాలను తనిఖీ చేశారు. గ్రామంలోని చిన్న చిన్న డబ్బాలు, కిరాణా దుకాణాలు, ఇతర వ్యాపార సముదాయల వెనుక, ఖాళీ స్థలంలో పేరుకుపోయిన చెత్తను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసేవారికి జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు.
గ్రామంలోని ఖాళీ ప్రదేశాల్లో హరితహారం కార్యక్రమం కింద మొక్కలు నాటించి వాటిని బాధ్యతగా పెంచి పెద్ద చేయాలని కలెక్టర్ సూచించారు. అపరిశుభ్రంగా ఉన్న గ్రామాల పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యేకించి పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ మూడు రోజులు గడిచినా ఇంకా చెత్త పేరుకుపోవడం చూసి తక్షణమే చెత్త తొలగించాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పెబ్బేరు మున్సిపాలిటీలో సమీకృత రైతుబజార్ మార్కెట్ యార్డ్‌లో ఉన్న స్థలాన్ని పరిశీలించారు. రైతుబజార్ ఏర్పాటు విషయమై ఇతర ప్రాంతాల్లో నిర్మించిన మోడళ్లు పరిశీలించి స్థలానికి ఆనుగుణంగా డిజైన్లు వేయించాలని, ఇంఛార్జి మున్సిపల్ కమిషనర్ కృష్ణయ్యను ఆదేశించారు. పెబ్బేరులోని సంతబజారుకు ముందు వీధిలో చెత్త తొలగింపును, శానిటేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. పీజెపీ కెనాల్ ప్రమాదాలు జరగకుండా రేలింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇదీచూడండి : 40 మంది విద్యార్థులపై కత్తితో దాడి