Medical College in Wanaparthy: వనపర్తి జిల్లా కేంద్రంలోని పెబ్బేరు రహదారి మర్రికుంటకాలనీలో 50 ఎకరాల సువిశాలమైన స్థలంలో ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మించారు. గత ఏడాది నవంబరు 15న ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్‌గా దీన్ని ప్రారంభించారు. కళాశాలలో ప్రవేశాల ప్రక్రియ పూర్తవడంతో తరగతుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. తరగతి గదులు, బోధనాసామగ్రి, మెడికోలకు వసతిగృహాలను సిద్ధం చేశారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేయనున్నట్లు కళాశాల నిర్వాహకులు చెప్పారు. ప్రభుత్వం కేటాయించిన 150 సీట్లను భర్తీ చేయడానికి కళాశాల నిర్వాహకులు విడతల వారీగా కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉత్తర భారతదేశానికి చెందిన పలువురు విద్యార్థులు జాతీయస్థాయి కోటాలో భాగంగా ఇక్కడ ప్రవేశాలు పొందారు. రేపటి నుంచి వైద్య విద్యా బోధన ప్రారంభం కానుంది.
ఇదీ ఆవిర్భావ క్రమం.. : 2021 జూన్ 2న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా 2022 జనవరి 25న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వనపర్తిని సందర్శించి కళాశాల ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలించారు. ఆగస్టు 11న జాతీయ వైద్య మండలి అధికార బృందం వనపర్తిని సందర్శించి స్థానికంగా చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించింది. అక్టోబరు 23న ప్రారంభమైన ప్రవేశాలు డిసెంబరు 27వ తేదీతో ముగిశాయి. 2022-23 విద్యా సంవత్సరంలో కళాశాలకు మొత్తం 150 సీట్లు కేటాయించారు. ఇందులో అఖిలభారత కోటా కింద 22 సీట్లను రిజర్వు చేశారు. ఆయా సీట్లలో సుదూర ప్రాంతాలైన రాజస్థాన్, బిహార్, హరియాణ, దిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన అభ్యర్థులు చేరారు. జిల్లాకు చెందిన పది మందికి పైగా విద్యార్థులకు సీట్లు లభించినట్లు వైద్య కళాశాల అధికారులు వివరించారు.
ప్రవేశాల్లో యువతులదే పైచేయి.. : వనపర్తి వైద్య కళాశాలలో యువతులే అత్యధికంగా ప్రవేశాలు పొందారు. కలేజీకి కేటాయించిన మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లలో 85 మంది యువతులే చేరారు. మిగిలిన 65 సీట్లలో యువకులు ప్రవేశాలు పొందారు. వైద్య విద్యార్థులకు అవసరమయ్యే వసతిగృహాలను అధికారులు సిద్ధంచేశారు. యువకులకు నాగవరంతండాలోని యువజన శిక్షణ కేంద్రం భవనంలో, యువతులకు పట్టణంలోని నాగవరం శివారులో వసతి భవనాన్ని తీర్చిదిద్దారు. ఆయా వసతిగృహాల్లో అన్ని సదుపాయాలు కల్పించారు. విద్యా బోధనకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలను పూర్తి చేశారు. వైద్య విద్య ప్రథమ సంవత్సరంలో అనాటమీ (శరీర నిర్మాణ శాస్త్రం), ఫిజియాలజీ (శరీర ధర్మశాస్త్రం), బయోకెమిస్ట్రీ (జీవ రసాయనశాస్త్రం) సబ్జెక్టులతో పాటు ప్రివెంటివ్ మెడిసిన్ (ముందస్తు వైద్య చికిత్స) అంశంపై బోధన చేయనున్నామని నిర్వాహకులు వివరించారు.
గ్రామీణ విద్యార్థులకు మహర్దశ :
'రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాల్లో వైద్య కళాశాలలను నెలకొల్పడంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద విద్యార్థులకు కూడా వైద్య విద్య అందుబాటులో వస్తోంది. వనపర్తిలో వైద్య కళాశాల ఏర్పాటుతో పది మందికిపైగా జిల్లాకు చెందిన విద్యార్థులకు వైద్య విద్య అందే అవకాశం కలిగింది. సమీప భవిష్యత్తులో వైద్యంపరంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి సాధించనుంది. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో వైద్య విద్యను అందిస్తాం.'- డాక్టర్ సునందిని, వైద్య కళాశాల ప్రధానాచార్యులు
ఇవీ చదవండి: