వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సరళాసాగర్ జలాశయానికి గండి పడింది. జలాశయం పూర్తిగా నిండటం, లీకేజీలు, ఆటోమేటిక్ సైఫన్ సిస్టం తెరచుకోక కట్టపై ఒత్తిడి అధికమై ఎడమవైపు ఆనకట్ట తెగిపోయింది. పూర్తి స్థాయి నీటి మట్టం 22 అడుగుల వరకూ నీరుంది. అర టీఎంసీ నీటి నిల్వ కొనసాగుతోంది. ఈ నీరంతా సరళాసాగర్ జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు చేరి ప్రాజెక్టు దాదాపుగా ఖాళీ అయింది. కొత్తపల్లి వాగు ద్వారా రామన్ పాడు జలాశయానికి భారీగా నీరు వెళ్తోంది. వాగుకు ఇరువైపుల ఉన్న నారుమళ్లు, పొలాలు నీట మునిగాయి.
ఇంత ఉద్ధృతం 2009 తర్వాత ఇప్పుడే
మదనాపురం వద్ద కొత్తకోట- ఆత్మకూరు రహదారిపై వంతెన పై నుంచి నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రామన్ పాడు జలాశయంపైనా ఒత్తిడి పెరగడంతో 19 గేట్లకు గానూ 10 గేట్లు తెరచి దిగువకు నీళ్లు విడుదల చేస్తున్నారు. ఈనీళ్లు ఊకచెట్టువాగు ద్వారా కృష్ణానదిలోకి చేరుతున్నాయి. 2009 తర్వాత ఈ స్థాయిలో రామన్ పాడుకు వరద రావడం ఇదే మొదటిసారి. ఊకచెట్టు వాగు కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అజ్జకొల్లు, మేడేపల్లి, రేచింతల, వీరరాఘవపురం లాంటి గ్రామాల్లో విద్యుత్ మోటార్లు, నారుమళ్లు నీటి మునిగే అవకాశం ఉంది.
పరిశీలించిన మంత్రి నిరంజన్ రెడ్డి
సరళాసాగర్ ప్రాజెక్టును వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, దేవరకద్ర శాసనసభ్యుడు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, వనపర్తి కలెక్టర్ శ్వేతామహంతి పరిశీలించారు. పూర్తిస్థాయిలో జలాశయం నిండలేదని, ప్రమాదవశాత్తు మాత్రమే కట్ట తెగిపోయిందని నిరంజన్ రెడ్డి అన్నారు. యుద్ధప్రాతిపదికన కట్టను పునర్నిమిస్తామని, ఆయకట్టు రైతులు నష్టపోకుండా ప్రత్యాయ్నాయంగా రెండో పంటకు నీళ్లందించే మార్గంపై దృష్టిసారిస్తామని ఆయన చెప్పారు.
లీకేజీలు ఉన్నా... పట్టించుకోలేదు!
గత కొద్ది రోజులుగా సరళాసాగర్ ప్రాజెక్టుపై లీకేజీలు ఉన్నాయని.. ఏళ్లుగా ప్రాజెక్టు మరమ్మతులకు నోచుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిండటంతో 4,500 ఎకరాల ఆయకట్టు రైతులు రెండో పంటకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఖాళీ కావడం వల్ల... అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. కొత్తపల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల పరిసర ప్రాంతాల్లోని నారుమళ్లు, వరి పొలాలు నీట మునిగి పంట నష్టం వాటిల్లింది. పంట నష్టం అంచనా వేయాల్సి ఉంది.
పర్యటకంగా అభివృద్ధి చేయండి
సరళాసాగర్ ప్రాజక్టుకు మరమ్మతులు చేయించి, పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే డిమాండ్లు చాలా కాలం నుంచి ఉన్నాయి. పర్యటకరంగ అవకాశాలపైనా ఇటీవలే నిపుణుల కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. ఇప్పటికైనా అరుదైన ఈ ప్రాజెక్టు పరిరక్షణ, అభివృద్ధిపై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి: 'అధికారుల నిర్లక్ష్యం వల్లే గండి పడింది'