భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు విస్తృతంగా చేపడుతున్నట్లు ఆ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో రాష్ట్రంలో 18 లక్షల సభ్యత్వం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఆన్లైన్ పద్ధతిలో వేల సంఖ్యలో సభ్యత నమోదు జరుగుతోందని వివరించారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి కుటుంబసమేతంగా పార్టీ సభ్యత్వం తీసుకునేలా చూడాలని కార్యకర్తలకు డీకే అరుణ సూచించారు. వచ్చేఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు. తెరాసను ఎదుర్కొనే శక్తి ఒక్క భాజపాకే ఉందని... కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో నిర్వహించిన భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి డీకే అరుణ పాల్గొన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన సాగుతోందని దుయ్యబట్టారు. కేసీఆర్ తన ఫామ్‌హౌస్ చుట్టున్న గ్రామాలను అభివృద్ధి చేసుకొని మిగిలిన ప్రాంతాలను గాలికి వదిలేశారని విమర్శించారు. కేటీఆర్‌ను సీఎం చేయడం కోసం వాస్తు బాగాలేదని జ్యోతిష్యులు చెప్పడం వల్ల సచివాలయం, అసెంబ్లీ కోసం ఎర్రమంజిల్‌ను కూల్చేస్తున్నారని మండిపడ్డారు. కూల్చడానికి వందల కోట్లు, కొత్త భవనాల కోసం వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : 'రుణమాఫీ తర్వాతే రైతు ఆత్మహత్యలు పెరిగాయి'