మెరుగైన వ్యవసాయానికి సలహాలు, సూచనలు అవసరమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అధికారులు అన్నదాతలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అందుకే రైతువేదికలు నిర్మిస్తున్నామని చెప్పారు.
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని చన్గోముల్, రంగాపూర్, దోమ, కుల్కచర్లల్లో రైతు వేదిక నిర్మాణాలకు శంకుస్థాపన ఆమె చేశారు. కుల్కచర్లలో సహకార బ్యాంకు దగ్గర ఏటీఎంను ప్రారంభించారు. కేసీఆర్ సర్కారు రైతు పక్షపాత ప్రభుత్వమని అన్నారు. కొన్ని గ్రామాలను కలిపి ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి, ప్రతి క్లస్టర్ కు ఒక రైతు వేదిక భవనాన్ని నిర్మించేలా ప్రణాళిక చేశామన్నారు. 20 లక్షల రూపాయలతో నిర్మించే రైతు వేదిక భవనాలను రెండు నెలల్లో పూర్తి చేసి రైతులకు అందజేస్తామని మంత్రి తెలిపారు.
రైతు వేదికల ద్వారా వ్యవసాయ అధికారులు రైతులకు పంట సాగుపై సూచనలు, మెళకువలు.. పండించిన పంటను మార్కెటింగ్ చేసుకునేందుకు కావాల్సిన సమాచారం అందజేస్తారని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు శ్రేయస్సు కోసం ఎన్నో రైతు సంక్షేమ పథకాలు రూపొందించారని పేర్కొన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్తో మాట్లాడి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాకు నీరు వచ్చేలా కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: నూటికి 70శాతం మందికి కరోనా సోకుతుంది: తలసాని