సంకల్ప బలముంటే.. సాధించే తపనుంటే.. లక్ష్యసాధనలో ఏ పరీక్ష అడ్డుకాదని నిరూపించిందో అమ్మ. మూడు రోజుల కిందటే ప్రసవమైనా పురిటి నొప్పులు భరిస్తూనే 140 కి.మీ. దాటొచ్చి చదువుపై తనకున్న ఇష్టాన్ని చాటుకుని అందరి మనసులు గెలుచుకుంది.
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన నేనావత్ సమతకు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో ప్రసవమైంది. ఆమెకు బుధవారం హైద్రాబాద్ ఎల్బీనగర్‌లో బీఈడీ ఎంట్రన్స్-2021 ఎగ్జామ్ ఉంది. బాలింతైనప్పటికీ చదువుకోవాలనే సంకల్పంతో అచ్చంపేట నుంచి హైద్రాబాద్ వచ్చింది. 140 కిలోమీటర్ల సుదూర ప్రయాణం చేసి బీఈడీ ప్రవేశ పరీక్ష రాసింది. సమత పరిస్థితిని తెలుసుకున్న చీఫ్ సూపరింటెండెంట్ రంగారెడ్డి, పరిశీలకులు కంభంపాటి యాదగిరి, నాగరాజులు ఆమెకు సాయం చేశారు. పరీక్ష రాసేంత వరకు సహాయసహకారాలు అందించారు.
చదువుకోవాలనే తపన, సంకల్పం ఉంటే చాలు ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవచ్చని సమత నిరూపించింది. బాలింతైనప్పటికీ ఎన్నో వ్యయప్రయాసల కోర్చి బీఈడీ ఎంట్రన్స్ పరీక్షకు హాజరైంది. అందరికి ఆదర్శంగా నిలిచింది.
ఇదీచూడండి: GOLD HALL MARK: బంగారం కొంటున్నారా..! అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..