సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల పరిధిలో మామిడి రైతుల గోస వర్ణనాతీతం. చేతికి వచ్చిన పంట నేలమట్టం అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేలరాలిన మామిడికాయను మార్కెట్కు తీసుకెళ్తే చేతి ఖర్చులు కూడా మిగలటం లేదంటున్నారు. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా మామిడి రైతులందరిదీ ఇదే పరిస్థితి.
ఇళ్లు తాకట్టు పెట్టి పంట సాగుచేశా....
తాను 20 ఎకరాలకు లక్ష రూపాయల పెట్టుబడి పెట్టినట్లు నాగయ్య అనే రైతు తెలిపారు. వడగండ్ల వర్షానికి మామిడి పంట మొత్తం నేలరాలిందని..ఇళ్లు తాకట్టు పెట్టి పంట సాగుచేస్తే అకాల వర్షం నిండా ముంచిందని కన్నీటి పర్యంతమయ్యారు.
కాలం కలిసిరాదు.. ప్రభుత్వం అండలేదు..
కాలం కలిసిరాక ప్రభుత్వం అండగ నిలవకపోవటంతో మామిడి రైతు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. మామిడి తోటలు తీసేసి పొలాలుగా మార్చుకుంటామని చెబుతున్నారు. పండ్లతోటల వల్ల లాభం కంటే నష్టమే అధికమైందని.. కూలీలకు డబ్బు కూడా చెల్లించలేకపోతున్నామని బాధపడుతున్నారు.
కాలం ఏదైనా నష్టం రైతుదే...
ఇలా ప్రతి యేడాది మామిడి రైతులు ఏదోవిధంగా నష్టపోతూనే వున్నారు. తమ సమస్యను అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాధుడే కరవయ్యారని వాపోతున్నారు. అప్పులు తీరక కాలం కలసి రాక రైతులు కుదేలవుతున్నారు.
ఇవీ చూడండి: మీది ప్రేమేనా... ఓ సారి ఆలోచించుకోండి!