హోరాహోరీ ప్రచారాలు... పోటాపోటీ పర్యటనలు... ఆరోపణలు, ప్రత్యారోపణలతో హుజూర్‌నగర్‌లో రోజురోజుకూ వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే 70 మందితో కూడిన బృందాన్ని తెరాస పంపితే... అంటీముట్టనట్లుగా వ్యవహరించే కాంగ్రెస్ నేతలంతా ఇంతకాలానికి ఒక్కటై, తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి బాసటగా నిలిచేందుకు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. అభ్యర్థిని ఖరారు చేసి ప్రకటన ఆపిన భాజపా... తామూ సొంతంగానే బరిలోకి దిగుతామంటున్న సీపీఎం... జట్టు కట్టేందుకు సమాలోచనలు జరిపే యోచనలో సీపీఐ, తెజస, తెదేపా. ఇలా అన్ని పార్టీల చూపుతో... ఉపఎన్నిక ప్రచారం హోరెత్తబోతోంది.
గెలుపే లక్ష్యంగా
ఉప ఎన్నికల ప్రచారంలో... తెరాస వేగం పెంచింది. గెలుపే లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం రూపొందించిన ప్రణాళికను... గ్రామ గ్రామాన అమలు చేయబోతోంది. క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకర్షించేందుకు... భారీస్థాయిలో నేతల్ని మోహరిస్తోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యదర్శులతో కూడిన 70 మంది బృందం... ఎప్పుడు, ఏం చేయాలో దిశానిర్దేశం చేస్తున్నారు నియోజకవర్గ ఇంఛార్జి పల్లా రాజేశ్వర్ రెడ్డి.
మూడు బృందాలు
సమన్వయకర్తలను మూడు బృందాలుగా విభజించి... ఎక్కడికక్కడ పనిచేసుకుని పోయేలా కార్యచరణ తయారు చేశారు. మండల స్థాయిలో మంత్రులు, గ్రామస్థాయిలో ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు పనిచేయనుండగా... సామాజిక సమీకరణాల ఆధారంగా మరికొందర్ని రంగంలోకి దింపబోతున్నారు. పార్లమెంటు సభ్యులతో... పురపాలికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
హస్తం ఐక్యతారాగం
అధికార పార్టీని సమర్థంగా ఎదుర్కొనేందుకు... కాంగ్రెస్ సైతం అస్త్రశస్త్రాల్ని సిద్ధం చేసుకుంది. ఇప్పటికే తెరాస నేతలపై ఒంటరిగా ఉత్తమ్ పోరాటం సాగిస్తుండగా... పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలంతా పీసీసీ అధ్యక్షుడికి బాసటగా నిలుస్తున్నారు. భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలంతా... ప్రచారానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. పద్మావతి అభ్యర్థిత్వంపై సందేహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి సైతం... తెరాస వ్యతిరేక పోరాటంలో రంగంలోకి దిగుతారన్న మాటలు వినపడుతున్నాయి.
రంగంలోకి జాతీయస్థాయి నేతలు
రాష్ట్ర నేతలంతా ఒకేసారి కాకుండా... బృందాల వారీగా ప్రచారం నిర్వహించేలా ఉత్తమ్ ప్రణాళికలు వేస్తున్నారు. ముఖ్యంగా ఒకరంటే ఒకరికి అసలే పడని నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు... పద్మావతి విజయం పట్ల ఐక్యతారాగం ఆలపిస్తున్నారు.
కోదాడ, హుజూర్ నగర్, మేళ్లచెరువు, మఠంపల్లి మండలాల్లో ఉత్తమ్‌కు పట్టు ఉంటే... గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడు మండలాల్లో వెంకటరెడ్డికి మంచి పలుకుబడి ఉంది. బంధువర్గానికి తోడు ఆయనను అభిమానించేవారు ఎక్కువగా ఈ మూడు మండలాల్లో ఉండటం... కోమటిరెడ్డి ప్రచారానికి వస్తే ఆ ఓట్లన్నీ కలసివస్తాయనే భావనలో కాంగ్రెస్ పార్టీ పెద్దలున్నారు.
హుజూర్ నగర్ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న హస్తం పార్టీ... జాతీయస్థాయి నేతల్ని రంగంలోకి దించే సూచనలు కనపడుతున్నాయి.
బీసీ ఎజెండాతో భాజపా
రెండు పార్టీల మధ్య హోరాహోరీ ఉంటుందనుకున్న దశలో... తాము కూడా రంగంలో ఉన్నామని భాజపా అంటోంది. సెగ్మెంట్లో అత్యధికులు గల ఓటర్లను ఆకర్షించేందుకు గాను... బీసీకి టికెట్ కేటాయించింది. కోటా రామారావు అభ్యర్థిత్వాన్ని పార్టీ నేతలు... దాదాపుగా ఖరారు చేశారు. ఇక ప్రచారాన్ని మొదలుపెట్టనున్న కమలం పార్టీ... రాష్ట్రంలోని నలుగురు ఎంపీల్ని రంగంలోకి దించబోతోంది. భారీ బహిరంగ సభలకు కేంద్ర మంత్రుల్ని రప్పిస్తే... ఫలితముంటుదన్న భావన భాజపాలో ఉంది. బీసీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే యోచనలో ఉంది.
మేమూ పోటీలో ఉన్నాం
ప్రధాన పార్టీలతోపాటు అటు చిన్న పార్టీలు సైతం... అభ్యర్థుల్ని రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించాయి. తమ పార్టీ సొంతంగా అభ్యర్థిని నిలుపుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం... హుజూర్ నగర్లోనే ప్రకటించారు. ఇక కూటమిగా జట్టు కట్టేందుకు... సీపీఐ, తెలంగాణ జన సమితి, తెలుగుదేశం పార్టీలు సమాలోచనలు సాగించే పనిలో పడ్డాయి. మరోవైపు తెలంగాణ ఇంటి పార్టీ తరఫున... తీన్మార్ మల్లన్నను రంగంలోకి దించుతున్నామని ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ప్రకటించారు.
ప్రచార జోరు
అన్ని పార్టీల అభ్యర్థులు రంగంలో దిగితే హుజూర్నగర్ ఉపఎన్నిక ప్రచారం హోరెత్తనుంది.
- ఇదీ చూడండి : హుజుర్నగర్ బరిలో తెదేపా..నేతలతో అధినేత చర్చ