సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టు పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. గత వానాకాలంలో కొట్టుకుపోయిన గేటును.. ఇప్పటి వరకూ తిరిగి బిగించక పోవడాన్ని నిరసిస్తూ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్టు వద్ద నిరసన చేపట్టారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 33 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పటేల్ రమేశ్ రెడ్డి ఆరోపించారు. గత వానాకాలంలో కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయిన గేటు వద్ద తక్షణమే నూతన గేటును ఏర్పాటు చేస్తామన్న మంత్రి జగదీశ్‌రెడ్డి.. 8 నెలలు గడుస్తున్నా నేటికీ పనులు పూర్తి చేయించలేక పోయారని మండిపడ్డారు. ఇందుకు మంత్రి జగదీశ్‌రెడ్డి పూర్తి బాధ్యత వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రాజెక్టు వద్ద నిరసన చేపట్టిన్నట్లు రమేశ్ రెడ్డి తెలిపారు. తక్షణమే సర్కారు స్పందించి కొత్త గేటు బిగించి.. మూసీ ఆయకట్టు రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీచూడండి: కేటీఆర్... మంత్రి పదవికి రాజీనామా చేయాలి: కాంగ్రెస్