నాగార్జునసాగర్ ప్రధాన కాలువలో కారు మునిగిపోయిన ఘటనలో మృతదేహాలను వెలికి తీశారు. శుక్రవారం రాత్రి 7 గంటల 45 నిమిషాలకు... సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చాకిరాల వద్ద కారు సాగర్ కాలువలో పడింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆరుగురు.... స్నేహితుడి వివాహానికి హాజరై తిరుగుపయనమైన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గుంతను తప్పించబోగా కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది.
అర్దరాత్రి 2 గంటల నుంచి
ప్రమాద సమయంలో కాలువలో 9 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. అర్ధరాత్రి 2 గంటల నుంచి రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు... వెలికితీతకు ప్రయత్నించారు. కాలువలో 18 అడుగుల లోతులో కారు ఉన్నట్లు గుర్తించారు. నీటి విడుదల తగ్గించి... కారుకు తాళ్లు కట్టి.... క్రేన్‌తో బయటకు లాగారు. వెలికి తీసిన కారులో ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు సికింద్రాబాద్‌కు చెందిన అబ్దుల్, నరేశ్, జాన్సన్, రాజేశ్, పవన్ కుమార్, సంతోశ్ కుమార్‌గా గుర్తించారు.
వేగమే కారణం
విగత జీవులుగా పడి ఉన్న తమవారిని చూసి మృతుల కుటుంబ సభ్యులు రోదించిన తీరు అక్కడున్నవారిని కంట తడి పెట్టించింది. ఓవర్ స్పీడ్‌తో ఉన్న కారు.. కంట్రోల్ కాకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఇవీ చూడండి : సీఎల్పీ నేత భట్టి సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్