వైద్యులకే అంతుచిక్కని మహమ్మారి ఎదిగిన బిడ్డలను మంచాన పడేసింది. తల, చేతి వేళ్ళు మాత్రమే కదిలించడం తప్ప కూర్చున్న చోటు నుంచి కదల్లేని దురవస్థలోకి నెట్టేసింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన బీరెడ్డి శ్రీధర్ రెడ్డి, మమత దంపతులకు సుజిత్, సౌరబ్ కుమారులు. పుట్టినప్పటి నుంచి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ పదేళ్ల ప్రాయం వచ్చేసరికి ఆధునిక వైద్యానికి కూడా అంతుచిక్కని కండరాలకు సంబంధించిన వ్యాధి ఆ ఇద్దరు అన్నదమ్ములను దివ్యాంగులుగా మార్చేసింది.
ఒకరి తర్వాత ఒకరిని..
మొదట చిన్న కుమారుడు సౌరబ్ ఈ వ్యాధి భారిన పడ్డాడు. ఆరు నెలల వ్యవధిలోనే పెద్ద కుమారుడు సుజిత్‌ను చుట్టుముట్టింది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూరు సహా ఎన్నో నగరాల్లోని ఆస్పత్రుల్లో చూపించినా ప్రయోజనం లేదు. లక్షలు ఖర్చుచేసినా ఫలితం శూన్యం. చివరికి వీరి రిపోర్టులను అమెరికాలో వైద్యులకు పంపించారు. వారు కూడా ఈ వ్యాధికి చికిత్సలేదని చేతులెత్తేశారు. ఇద్దరు కొడుకులు పుట్టారన్న సంతోషం శ్రీధర్ రెడ్డి, మమత దంపతులకు కన్నీటినే మిగిల్చింది.
కష్టాలు పగబట్టినయా
ఇద్దరు పిల్లల్లో సుజిత్‌కు ఓ కిడ్నీ పాడైంది. ప్రస్తుతం ఒక్క కిడ్నీతోనే బతుకీడుస్తున్నాడు. ఇన్ని కష్టాలు చాలవన్నట్లు శ్రీధర్ రెడ్డి తండ్రి ఈమధ్యనే జరిగిన ఓ ప్రమాదంలో కాలుని కోల్పోయాడు. ఇంటి నిండా కష్టాలతో స్కూలు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీధర్ రెడ్డి కుటుంబం మొత్తానికి కొద్దిపాటి జీతం డబ్బులే జీవనాధారం.
సారూ.. సాయం చేయండి
అడుగు కూడా కదపలేని పిల్లలను కదల్చడం ఎవరివల్ల కావడం లేదు. తండ్రే అన్నీ తానై పిల్లలకు సపర్యలు చేస్తున్నాడు. కనీసం సదరన్ శిబిరానికి వెళ్లలేని స్థితిలో వీరున్నారు. ప్రభుత్వం తరఫున సాయం చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబమంతా చేతిలెత్తి వేడుకుంటున్నది.
ఇదీ చూడండి: 'వారి తల్లిదండ్రులను ఆదుకోండి..'