లాక్‌డౌన్ నేపథ్యంలో ఆహారభద్రత కార్డున్న కుటుంబాలకు ఏప్రిల్, మే మాసాల్లో ఉచితంగా బియ్యంతో పాటు రూ.1,500 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ ముగిసింది. మే నెలకు సంబంధించిన నగదు బదిలీ శనివారం ప్రారంభం కానుంది. ఇప్పటికీ సిద్దిపేట జిల్లాలో 15 వేల పైచిలుకు కుటుంబాలకు ఏప్రిల్ మాసానికి సంబంధించిన నగదు అందలేదు.
జిల్లాలో 2,88,919 ఆహారభద్రత కార్డులున్నాయి. ఆధార్‌కార్డుతో బ్యాంకు ఖాతాలు అనుసంధానమైన 2,62,617 కుటుంబాలకు యజమాని పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం నగదు జమ చేసింది. మరో 11,020 కుటుంబాల యజమానులకు తపాలా శాఖ ద్వారా నగదు ఇచ్చే ప్రక్రియ కొద్ది రోజుల కిందట ప్రారంభించారు. లబ్ధిదారుల వివరాలతో కూడిన జాబితాలు పోస్టాఫీసుల్లో ఉన్నాయి. వాటిలో పేరున్న వారు ఆధార్, ఆహార భద్రత కార్డు ప్రతిని తీసుకెళ్లి బయోమెట్రిక్ యంత్రంలో వేలిముద్ర ఇవ్వడం ద్వారా నగదు పొందుతున్నారు.
స్పష్టత లేదు...
జిల్లాలో మరో 15,282 కుటుంబాలకు నగదు ఏ రూపంలోనూ అందలేదు. ఈ కార్డుదారుల్లో కొంత మందికి బ్యాంకు ఖాతాలు లేక పోగా, మరికొంత మంది ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం కాలేదని తెలుస్తోంది. ఈ తరుణంలో ప్రత్యామ్నాయంగా తపాలా శాఖ ద్వారా నగదు అందించాలి. 15 వేలకు పైగా ఉన్న వారి వివరాలు ఈ శాఖకు కూడా అందలేదు. దీంతో నగదు అందుతుందా..? లేదా...? అనే ఆందోళనలో పేద ప్రజలున్నారు. వారికి సరైన సమాధానం చెప్పేవారు కరవయ్యారు.
మే నెలకు సంబంధించి నగదు బదిలీ శనివారం నుంచి అంకురార్పణ జరగనుంది. ఇకనైనా ఈ 15వేల మందికి నగదు ఇచ్చే అంశంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. లాక్‌డౌన్‌తో పనులు స్తంభించడం వల్ల ఆయా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
ఈ 15 వేల మందికి నగదు ఎలా అందిస్తారో..? తమ వద్ద కూడా స్పష్టత లేదన్నారు పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి హరీశ్. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే కార్డుదారులకు సమాచారం ఇస్తామన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
44 శాతం దుకాణాలకే బియ్యం..
మే నెలకు సంబంధించిన ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. జిల్లాలోని 44 శాతం దుకాణాలకు మాత్రమే బియ్యం కోటా చేరింది. ఇందులోనూ కొన్నింట సగం కోటా మాత్రమే సరఫరా అయింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆహారభద్రత కార్డున్న కుటుంబాల్లో ఒక్కో సభ్యుడికి ఉచితంగా 12 కిలోల బియ్యం గత నెలలో ఇచ్చారు. ఈ నెలలోనూ ఇవ్వనున్నారు.
జిల్లాలో 680 రేషన్ దుకాణాలున్నాయి. శుక్రవారం నాటికి 301 దుకాణాలకు మాత్రమే బియ్యం సరఫరా అయ్యాయి. అంటే 44 శాతం దుకాణాలకు బియ్యం చేరాయన్నమాట. 10,700 టన్నులకు గానూ దాదాపు 4 వేల టన్నులు సరఫరా అయ్యాయి. దీంతో మే 1 నుంచి అన్ని దుకాణాల్లో బియ్యం వితరణ షురూ కాలేదు. అన్నింటా ప్రారంభం కావాలంటే మరో నాలుగైదు రోజులు ఆగాల్సిన స్థితి ఉంది. జిల్లాలో ప్రతి కార్డుకు ఉచితంగా ఇవ్వాల్సిన కందిపప్పు వితరణకు కొద్ది రోజులు ఆగాల్సిందే.
సిద్దిపేట మండల నిల్వ కేంద్రం నుంచి సిద్దిపేట పట్టణంలోని రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తుంటారు. కానీ ఎంఎల్‌ఎస్ కేంద్రం బాధ్యుడు తాను నిర్దేశించిన ధర్మకాంటలోనే తూకం వేయాలని, ఇతర కాంటాలో వేయిస్తే తాను అంగీకరించబోనని డీలర్లతో స్పష్టం చేయడం వల్ల వారు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో పట్టణంలో తక్కువ దుకాణాలకు బియ్యం సరఫరా అయ్యాయి.
నాలుగైదు రోజుల్లో జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాలకు బియ్యం పూర్తి స్థాయిలో చేరతాయన్నారు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి హరీశ్. గత నెలలో 24వ తేదీ వరకు బియ్యం ఇచ్చామని, 25వ తేదీ నుంచి గోదాముల ద్వారా మే నెలకు సంబంధించిన బియ్యం తరలింపు ప్రారంభం కావడం వల్ల 1వ తేదీ కల్లా అన్ని దుకాణాలకు చేరలేదన్నారు.