ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఆధునాతన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలోనే రూ.2.5 కోట్లతో అత్యాధునిక డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు పూర్తి ఉచితంగా 57 రకాల ఆరోగ్య పరీక్షలు అందుబాటులోకి వస్తాయని మంత్రి వెల్లడించారు. పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీ చరవాణికే పంపుతామన్నారు. రాబోయే పక్షం రోజుల్లోనే సిద్దిపేటలో ఐసీయూ పడకలను 40కి పెంచుతామని మంత్రి తెలిపారు. త్వరలోనే అందరికీ సిటీ స్కాన్ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
50 వేల ఎకరాల లక్ష్యం :
జిల్లాలో 50 వేల ఎకరాలలో పామాయిల్ సాగు లక్ష్యంగా నిర్ణయించుకున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. పామాయిల్ సాగుతో రైతులకు సుస్థిర ఆదాయంతో పాటు కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలని సూచించారు. పామాయిల్ పంటకు చీడ పీడల బెడద, అటవీ జంతువుల బాధలు ఉండవన్నారు. పామాయిల్ పంట సాగు చేసే రైతులకు పెద్ద ఎత్తున ప్రభుత్వ రాయితీలు, అంతర పంటల సాగుకు అవకాశం ఉంటుందని తెలిపారు. పట్టు పురుగుల పెంపకాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు ముందుకు వచ్చే ప్రజా ప్రతినిధులు, రైతులకు కర్ణాటక, ఖమ్మం జిల్లాలకు విజ్ఞాన యాత్రలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ రోజా శర్మ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఓడతెల సతీశ్ కుమార్, జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.