ఒకే రోజు వేర్వేరు అగ్నిప్రమాదాల వల్ల పశుగ్రాసం, పశువుల కొట్టాలు, మామిడి తోటలు, బావుల వద్ద ఉన్న పైపులు దగ్ధమై రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రేగొండ గ్రామంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని ఎర్రబెల్లి రాజకొమురయ్య, లక్కాకుల సరోజన, ఇప్ప నారాయణ, కుంభం మల్లారెడ్డిలకు చెందిన మామిడి తోటలు కాలిపోయి దగ్ధం అయ్యాయి. అదేవిధంగా జంగా శ్రీను అనే రైతుకు సంబంధించిన పీవీసీ పైపులు కాలిపోయి నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ వేణుగోపాల్ రావు ఘటనా స్థలానికి చేరుకొని జరిగిన నష్టాన్ని పరిశీలించి రైతులకు మనోధైర్యం కల్పించారు. తహసీల్దార్‌తో పాటు ఆర్ఐ సురేందర్, మాజీ జడ్పీటీసీ బీలు నాయక్, సర్పంచ్ పరిశీలించారు. నష్టం విలువ సుమారుగా మూడు లక్షలుగా అంచనా వేసినట్లు ఆర్ఐ సురేందర్ తెలిపారు.
అదేవిధంగా అక్కన్నపేట మండలంలోని లో పోతారం(జె) గ్రామంలో వనం సంపత్, వనం సురేందర్, జెడ కనకయ్య, లింగాల సిద్ధిమల్లుకు చెందిన గడ్డివాములు, పశువుల కొట్టాలు ప్రమాదవశాత్తు నిప్పంటుకుని దగ్ధమయ్యాయి. సుమారు లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కన్నపేట మండలం మోత్కుపల్లి గ్రామానికి చెందిన కాశబోయిన సంపత్ అనే రైతుకు చెందిన మూడు ట్రాక్టర్ల పశుగ్రాసం, పశువుల కొట్టం ప్రమాదవశాత్తు నిప్పంటుకుని కాలిపోయాయి. ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందించాలని రైతు సంపత్ విజ్ఞప్తి చేశాడు.
ఇవీ చూడండి: వరంగల్‌లో నలుగురు వలస కార్మికులు మృతి