మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఆదర్శ రైతే కాకుండా ఆదర్శ నాయకుడు కూడా అని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ముత్యం రెడ్డి ఆశయాలను నెరవేర్చాలంటే... ఆయన తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డిని ఆశీర్వాదించాలని కోరారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలం స్వగ్రామమైన తుక్కాపూర్‌లో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మొన్నటి దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా, తెరాస తప్పుడు ప్రచారం చేయటం వల్లే తాము ఓడిపోయామని ఉత్తమ్ తెలిపారు. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి తెరాస ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక తెరాసకు తొత్తులుగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈనెల 11న ప్రతి జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద నిరసన చేపడతామని వెల్లడించారు. తెరాస, భాజపా నాయకులు పగలు కొట్టుకుంటారు.. రాత్రి కలుసుకుంటారని ఎంపీ రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆ పార్టీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్ల రూపాయలు దండుకున్న ఆధారాలు ఇస్తే... కొట్లాడే దమ్ము బండి సంజయ్‌కి ఉందా అని సవాల్ విసిరారు.