Kshirasagar Land Mafia: ఒక్కటి కాదు.. పది కాదు. ఏకంగా రూ.డెబ్బై అయిదు కోట్ల విలువ చేసే భూమి అది. పలుకుబడిఉన్న కొందరు దాని చుట్టూ ఇనుప తీగతో కంచె నిర్మించారు. సరిహద్దుల్లో ఉన్న రైతులను అటువైపు రానీయడం లేదు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న దళిత రైతులకు హక్కులు లేవు పొమ్మంటున్నారు. కాగా తమ భూములు ఆక్రమణకు గురయ్యాయి.. లెక్క తేల్చండని రైతులు తహసీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ ‘దళితుల భూముల్లో దగా పర్వం’లో మరో కోణం ఇది.
రావద్దంటూ కట్టడి..
ములుగు మండలం క్షీరసాగర్ పరిధిలోని 161 సర్వే నంబరులో పట్టా భూములతో పాటు ఉన్న ప్రభుత్వ భూముల్లో కొంత విస్తీర్ణాన్ని కొందరు కబ్జా చేశారు. పలువురి నుంచి కొనుగోలు చేశామని భూమిని చూపుతూ.. పక్కనే ఉన్న మరింత విస్తీర్ణాన్ని కలిపేసుకున్నారు. దాదాపు 35 ఎకరాల వరకు ఉన్న ఈ భూముల్లోకి ఎవరినీ రానివ్వడం లేదు. కొన్నాళ్లుగా కొందరు తిష్టవేసి భూముల్లోకి రానివ్వడం లేదంటూ పొలాల్లో పశువులను మేపుకొంటున్న రైతులు చెబుతున్నారు. వాస్తవానికి ఇక్కడున్న భూముల సరిహద్దులు సక్రమంగా లేవని ఈ కారణంతోనే గ్రామంలో భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్న కొందరు ఎవరికీ చెందని విస్తీర్ణాన్ని ఆక్రమించుకుంటున్నారన్నారు. క్షీరసాగర్‌లో దళితులు సాగు చేసుకుంటున్నట్లు రెవెన్యూ రికార్డుల్లో చూపుతున్న 119.30 ఎకరాలకు సంబంధించిన యాజమాన్య హక్కుల్లో స్పష్టత లేదని గ్రామస్థులు చెబుతున్నారు. 1991లో సాదాబైనామా కింద వేరేవారి నుంచి దళితులకు 13 బి పట్టాలు ఇచ్చినట్లు చూపారని, కానీ రికార్డుల్లో ఉన్నదానికంటే క్షేత్రస్థాయిలో భారీ విస్తీర్ణం ఉందంటున్నారు. ఇందులో రైతులు సాగు చేసుకుంటున్న విస్తీర్ణం తక్కువగానే ఉందని, మిగులు భూములు పెద్ద ఎత్తున ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. భూ యాజమాన్య హక్కులు తేల్చి పట్టాపాసుపుస్తకాలు జారీ చేయాలని వారు కోరుతున్నారు.
తమ భూముల్లో 25 ఎకరాల భూమి లేదని కొందరు చెబుతున్నారని, దౌర్జన్యం చేస్తున్నారంటూ గత నెల 11న క్షీరసాగర్ గ్రామస్థులు కొందరు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. తమ భూములను గుర్తించి న్యాయం చేయాలని కోరారు. అదే రోజు ములుగు మండల తహసీల్దారుకు సైతం వినతి పత్రం అందజేశారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు లేకపోవడంతో గత నెల 30న హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మేకలు మేపుకొనేందుకు ఉన్న భూములకు కంచె వేసి ఆక్రమించారని, న్యాయం చేయాలని వారు కోరారు.
ఇవీ చూడండి: తెలంగాణలో జోరుగా 'అక్షయ' అమ్మకాలు
లాభాల్లో ఉన్న సంస్థను ఆర్నెళ్లక్రితం ఏర్పాటైన సంస్థకు ఎలా అమ్ముతారు..?'