రాష్ట్రంలో సన్నరకం వరి సాగు, మద్దతు ధర విషయంలో రైతుల దయనీయ స్థితిని హైకోర్టు సుమోటో స్వీకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు సన్నరకం ధాన్యం పంటను సాగు చేయాలని లేకపోతే రైతుబంధు పథకం నిలిపివేస్తామని నియంత్రిత వ్యవసాయం చేయించారని ఆగ్రహించారు.
అతివృష్టిని తట్టుకొని రైతులు సన్నరకం పంటను పండించి 20 రోజులకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నా కొనేవారు లేరని ఆవేదన చెందారు. సీఎం సన్నరకం వరి ధాన్యానికి 100 నుండి 150 రూపాయలు బోనస్‌గా చెల్లిస్తామని చెప్పి 20 రోజులు గడుస్తున్నా..అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తే కేంద్రం, ఎఫ్.సి.ఐ ధాన్యాన్ని కొనబోమని తెలిపినట్లు పత్రికల ద్వారా తెలిపారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరి ధాన్యానికి బోనస్‌గా ఇచ్చే రూ.500 రాష్ట్రమే భరించాలన్నారని... ఇలా సన్న రకం వరి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గందరగోళ ప్రకటనలు చేస్తూ.. రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. సన్నరకం వరి సాగుతో దిగుబడి నష్టపోయామని రైతులు వాపోతున్నారు.
రైతుల అవస్థలను పరిగణలోకి తీసుకుని వారి విజ్ఞప్తిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అత్యవసర సుమోటోగా స్వీకరించి న్యాయం చేయాలని కోరారు.
ఇవీ చదవండి: తుక్కాపూర్‌లో మల్లన్నసాగర్ పంపుహౌజ్ వద్ద ఉద్రిక్తత