సిద్దిపేట జిల్లాలో అప్పుల బాధతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గజ్వేల్ మండలం అనంతరంపల్లికి చెందిన రాజు రెండేళ్ల నుంచి భార్య లలిత, ఇద్దరు పిల్లలతో కలిసి వేములఘాట్లోని తన అత్తింట్లో నివాసం ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. గ్రామ శివారులో పురుగుల మందు తాగి తన చావుకు పదో తరగతి మిత్రులంతా రావాలంటూ ఫోన్లో ఆడియో రికార్డ్ చేశాడు. వాట్సాప్ గ్రూప్ల్లో అందరికీ ఆ సందేశం పంపించాడు.
చికిత్స ప్రారంభించేలోగానే...
కుకునూర్ పల్లికి వెళ్లి వస్తోన్న అత్త మామలకు, రాజు రోడ్డు పక్కన ఇబ్బంది పడుతూ కనిపించాడు. వెంటనే అతని వద్దకు వెళ్లిన వీరికి విషయం తెలిసింది. హుటాహుటిన 108 వాహనానికి సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు. చికిత్స ప్రారంభించే లోగానే బాధితుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. శవ పరీక్షల అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
ఇవీ చూడండి : అంతిమ విజయం సత్యానిదే-నిర్భయ తల్లిదండ్రులతో ముఖాముఖి