Bandi sanjay fire on CM KCR: తెరాస వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు... ధాన్యం కొనుగోళ్ల సమస్య సృష్టించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ బీరంగూడలో తేదేపా, కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన కౌన్సిలర్లను... కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బెంగాల్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా భాజపా అధిక సీట్లు సాధించి కాషాయం జెండా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం పంపుతున్న నిధులతో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూ... తెరాస ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని పేర్కొన్నారు. తెరాస హయాంలో ఎవరూ సంతోషంగా లేరని తెలిపారు. ఈ అరాచక పాలన అంతమయ్యే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్, కేటీఆర్‌ను జైలుకు పంపుతామని బండి సంజయ్ అన్నారు. తెరాస పాలనతో విసుగుచెందిన రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. అది భాజపాతోనే సాధ్యమని ఆయన తెలిపారు. ఈనెల 27న నిరుద్యోగ దీక్ష చేపడుతున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు.
తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఆ మార్పు కేవలం భాజపాతోనే సాధ్యమని భావిస్తున్న తరుణంలో కాషాయపు జెండాలు పట్టుకుని గల్లీ గల్లీ తిరుగుతుంటే జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. దాన్ని ఓర్వలేకనే రాష్ట్ర ముఖ్యమంత్రి పిచ్చికూతలు కూస్తున్నారు. చాలా మంది అంటున్నారు కేసీఆర్‌ను జైలుకు ఎప్పుడు పంపుతారు బండి సంజయ్ అని. పక్కా కేసీఆర్‌ను జైలుకు పంపుడే... చూస్తున్నాం సమయం కోసం చూస్తున్నాం.- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి: Cold weather in TS: పెరిగిన చలి తీవ్రత.. భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు