Officers Collecting Money From New Teachers : హైదరాబాద్లో కొత్తగా టీచర్ జాబ్లో చేరిన వారికి జీతం అందాలంటే రూ.2వేలు లంచం ఇవ్వాల్సిందే. వేతనాల బిల్లులు, పేఅండ్ అకౌంట్స్ విభాగంలో ఆమోదముద్ర వేయించేందుకు విద్యాశాఖలోని కొంత మంది సిబ్బంది కొత్త టీచర్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. నగదు ఇచ్చేందుకు ఇబ్బంది అనుకుంటే గూగుల్ ఫే, ఫోన్ ఫే ద్వారా ఇవ్వాలంటూ చెప్తున్నారు. తమకు వస్తున్న తొలి జీతం మేమే ఇప్పిస్తున్నామంటూ కిందిస్థాయి సిబ్బంది డిమాండ్ చేయడం ఇబ్బందికరంగా మారిందని సదరు ఉపాధ్యాయులు వాపోతున్నారు. మండలాల వారీగా విధులు నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారుల్లో కొంత మంది పరోక్షంగా ఈ బలవంతపు వసూళ్లు ప్రోత్సహిస్తున్నందుకే కొత్త టీచర్లు మౌనం పాటిస్తున్నారు.
జీతం రావాలలంటే లంచం ఇవ్వాల్సిందే : హైదరాబాద్లో 680 మంది ఉపాధ్యాయులు కొత్తగా విధుల్లో చేరారు. నవంబరు నెల మొత్తం పనిచేస్తే వారికి డిసెంబర్ మొదటి వారంలో జీతం వస్తుంది. వారంతా ఎక్కడ పనిచేస్తున్నారనే సమాచారాన్ని జిల్లా విద్యాశాఖ కిందిస్థాయి సిబ్బంది తీసుకున్నారు. పాఠశాలల వారీగా వారిని గుర్తించి తొలి జీతం రావాలలంటే లంచం ఇవ్వాలని నవంబరు రెండోవారంలో వారికి చెప్పారు. ఈ నెల 24లోపు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసే బాధ్యతను ఇద్దరు వ్యక్తులకు అప్పజెప్పారు. అన్ని మండలాల్లో ఈ వసూళ్లు జరుగుతున్నా మా వద్ద ఎవరూ డబ్బు వసూలు చేయడం లేదని అధికారులు బుకాయిస్తున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని ఓ మండల విద్యాధికారిని దీనిపై ప్రశ్నించగా తాము పైసలు వసూలు చేయడం లేదని పే అండ్ అకౌంట్స్ వారు డబ్బులు అడుగుతున్నారని తెలిపారు. మాపై కాకుండా వారి అక్రమాలను వెలికితీయాలని చెప్పారు.
రూ.500ల నుంచి రూ.వెయ్యి వరకూ వసూల్ : హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విధులు చేస్తున్న టీచర్ల జీతాల బిల్లులకు ఆమోద ముద్ర వేయించేందుకు ఒక్కొక్క టీచర్ నుంచి రూ.500ల నుంచి రూ.వెయ్యి వరకూ వసూలు చేస్తున్నారు. ప్రతి ఉపాధ్యాయుడు తనకు రావాల్సిన జీతం బిల్లును ఆన్‌లైన్‌లో ఎంటర్ చేసిన వెంటనే సంబంధిత ప్రధానోపాధ్యాయుడు లేదా మండల విద్యాధికారికి ఓటీపీ వస్తుంది.
ఉపాధ్యాయుడు జీతం బిల్లును సక్రమంగా నమోదు చేశారా లేదా అని పరిశీలించాక ఓటీపీ నమోదు చేస్తే బిల్లు పాసవుతుంది. అందుకు విరుద్ధంగా ఓటీపీలను కొందరు ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు ఇతరులకు ఇచ్చి బిల్లులు చేపిస్తున్నారు. ఓటీపీలు వారికే ఇస్తున్నారు. పేఅండ్ అకౌంట్ వారికి ఇస్తున్నామంటూ వసూలు చేస్తున్న సొమ్ము ప్రైవేటు వ్యక్తులు తీసుకుంటున్నారా? వారికే ఇస్తున్నారా అని ఉన్నతాధికారులు విచారణ జరిపితే అక్రమాలు బయటపడతాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త టీచర్ల కళకళ - అర్ధరాత్రి వరకు కొనసాగిన పోస్టింగ్‌లు
విద్యా వాలంటీర్ల నియామకానికి సర్కార్ అనుమతి - కొత్త టీచర్లు వచ్చేవరకు మాత్రమే