సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్, నియోజకవర్గ అభివృద్ధికి వెయ్యి కోట్లు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన కుమార్తె జయారెడ్డితో కలిసి..హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం పాదయాత్రగా అసెంబ్లీకి వెళ్లారు. అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలు మాట్లాడే అవకాశం రాకపోవడంతో ట్యాంక్ బండ్ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేశానని జగ్గారెడ్డి తెలిపారు.
సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని.. కానీ తన నియోజకవర్గ మెడికల్ కాలేజీని సిద్దిపేటకు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. 2013లో 5 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే.. తెరాస ప్రభుత్వం వచ్చాక వారిని ఆ స్థలాల నుంచి ఖాళీ చేయించారని మండిపడ్డారు.
సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఇస్తామని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గన్ పార్కు మీడియా పాయింట్ వద్ద తెలిపారు. 40 వేల మంది పేదలు ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్నారని.. వారందరికీ ఇంటి స్థలాలు ఇవ్వమంటే స్పందన లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సంగారెడ్డి నియోజకవర్గ డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : షేర్ మార్కెట్ పేరుతో మోసం.. రూ.50కోట్లతో శఠగోపం