సంగారెడ్డిలో తారా ప్రభుత్వ, మహిళా డిగ్రీ, సదాశివపేట, జోగిపేట, పటాన్‌చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్‌లోనూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో 4వేల మంది వరకు విద్యార్థులు ఉన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో తరగతులు నిలిచిపోగా ఆన్‌లైన్ బోధన సాగిస్తున్నారు. సమాచార, సాంకేతిక వ్యవస్థను ఉపయోగించుకుని విద్యార్థులకు అర్థమయ్యేలా బోధిస్తున్నారు.
సరికొత్త పంథా...
లాక్‌డౌన్‌కు ముందు కళాశాలల్లో సెమినార్లు నిర్వహించేవారు. ఈ సదస్సులకు వివిధ ప్రాంతాల నుంచి విషయ నిపుణులు రిసోర్సు పర్సన్లుగా హాజరయ్యే వారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సెమినార్ నిర్వహణ తీరు మారింది. విద్యార్థులకు చరవాణి లేదా కంప్యూటర్ ఉండి.. వాటికి అంతర్జాలం సదుపాయం ఉంటే అందరినీ సమన్వయం చేస్తూ ఆయా అంశాలపై వెబినార్ నిర్వహిస్తున్నారు. అనుభవం కలిగిన అధ్యాపకులు, విద్యార్థులు, వివిధ వర్గాల మేధావులు ఇందులో పాల్గొంటున్నారు. వీడియో ఆధారిత యాప్‌ల సాాయంతో నిర్వహించే వెబినార్‌లో 100 మంది వరకు ఉచితంగా పాల్గొనవచ్చు.
లోతైన చర్చలు...
వెబినార్ విధానం లోతైన చర్చ, విశ్లేషణకు దోహదం చేస్తుంది. జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వెబినార్ నిర్వహణ క్రమంగా పెరుగుతోంది. సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో ఇప్పటికే మూడు వెబినార్‌లు నిర్వహించారు. న్యాక్ గుర్తింపు సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యాపకులు వెబినార్ ద్వారా సలహాలు, సూచనలు చేశారు. కొవిడ్-19 చుట్టూ ముడిపడిన అంశాలపై జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వెబినార్ ద్వారా విద్యార్థుల్లో అవగాహన పెంపొందించారు.
చర్చిస్తున్న అంశాలు ఇవీ...
● ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నత విద్య, విద్యాసంస్థల పరిస్థితి.. అధిగమించేందుకు మార్గాలు
● అంతర్జాలం వేదికగా బోధనతో పరిణామాలు
● దేశ ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 ప్రభావం
● కరోనా మహమ్మారి నియంత్రణలో విద్యార్థుల పాత్ర
విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంచేందుకే...
లాక్‌డౌన్ నేపథ్యంలో కళాశాలల్లో సదస్సులు నిర్వహించే పరిస్థితి లేదు. దీనివల్ల విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం లోపించకూడదన్న ఉద్దేశంతోనే ఉన్నత విద్యాశాఖ సూచనల మేరకు వెబినార్‌లు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రస్తుత పరిస్థితులపై చర్చించడంతోపాటు ఉజ్వల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం.
-కృష్ణమూర్తి, ప్రిన్సిపల్, తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల (సంగారెడ్డి)