2016 నవంబరులో జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో కార్డియాలజీ, యూరాలజీ విభాగాలను మంజూరు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. మౌలిక సదుపాయల కల్పన, పరికరాల కొనుగోలు కోసం ఫిబ్రవరి 2017లో రూ.3కోట్ల 58లక్షలు కేటాయించింది. ఆస్పత్రి ఆవరణలోని ఖాళీ భవనంలో ఈ ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే పనులు ప్రారంభించేందుకు 2017లో ఆర్‌అండ్‌బీ శాఖ పర్యవేక్షణలో టెండర్లు కూడా ఖరారు చేశారు.
సిబ్బంది ఉంది.. సదుపాయాలే లేవు..
అధికారుల మధ్య పర్యవేక్షణ లోపంతో ఆసుపత్రి మౌళిక సదుపాయాల పనులు మూడేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటి వరకు సెంట్రల్ ఆక్సిజన్ సప్లయ్, ఎయిర్ కండీషన్ పైపులైన్లు మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ విభాగాలకు అవసరమైన వైద్యులు, సిబ్బందిని సైతం రెండున్నర ఏళ్ల క్రితమే ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేశారు.
డాక్టర్లే కావాలని చేస్తున్నారా?
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు చాలామంది సొంతంగా ప్రైవేటు ఆసుపత్రులు నడిపిస్తుంటారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వైద్యులకు కూడా ప్రైవేటు ఆసుపత్రులున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో కార్డియాలజీ, యూరాలజీ సౌకర్యాలు కల్పిస్తే తమ దవాఖానాలకు గిరాకీ తగ్గిపోతుందనే ఆలస్యం చేస్తున్నారంటున్నారని ఆరోపిస్తున్నారు స్థానిక ప్రజలు. ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. వైద్యులు మాత్రం ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవలు కొనసాగించడం స్థానికుల ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.
గుత్తేదారుదే నిర్లక్ష్యం
ప్రభుత్వం నిధులు విడుదల చేసే సమయంలో 90రోజుల్లో పనులు పూర్తి చేయాలని నిబంధన పెట్టింది. మూడేళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కేవలం పదో వంతు పనులు కూడా పూర్తి కాలేదు. గుత్తేదారుల వల్లే పనులు ఆలస్యం అవుతున్నాయని జిల్లా వైద్యాధికారి మోజీరాం రాథోడ్ ఆరోపిస్తున్నారు. పనులు పూర్తి చేసిన తర్వాత పరికరాలు కోనుగోలు చేస్తామని.. రెండు నెలల్లో కార్డియాలజీ, యూరాలజీ విభాగాలు అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతున్నారు.
ఆసుపత్రిలో ఖరీదైన సేవలు వినియోగంలోకి తీసుకువస్తే తమకు మేలు జరుగుతుందని జిల్లా వాసులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: 'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్ పిటిషన్